Cow Dung : ఆవు పేడతో చాలా ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఆవు పేడ నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. నేలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ధాన్యాల నుండి తోట మొక్కల వరకు పండ్లు, కూరగాయల వరకు అన్ని రకాల మొక్కలను పెంచడానికి అవసరమైన పోషకాలు ఇందులో ఉంటాయి. ఆవు పేడతో అగరబత్తీలు, దీపపు కుందులు తయారు చేయడం చూశాం. కానీ ఓ దేశం మాత్రం ఆవు పేడతో ఏకంగా బస్సులు నడిచేందుకు ఇంధనం తయారు చేయడం అందర్నీ ఆకర్షిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


పాకిస్థాన్ ఓ కొత్త ప్రయోగం చేసింది. పాకిస్తాన్ ఆవు పేడతో ఇంధనాన్ని తయారు చేసింది. దీన్ని బస్సులను నడపడానికి ఉపయోగిస్తోంది. పాకిస్థాన్ చేసిన ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇప్పుడు ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అంతే కాదు, వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. 


ఆవు పేడ నుండి ఇంధనం


పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో గత కొన్నేళ్లుగా 200కు పైగా బస్సులను ఆవు పేడతో నడుపుతున్నారు. అంటే ఈ బస్సుల్లో వినియోగించే ఇంధనం పూర్తిగా ఆవు పేడతో తయారైంది. కరాచీ నగరంలో గ్రీన్ బస్ రాపిడ్ ట్రాన్సిట్ (BRT) అనే బస్సు నెట్‌వర్క్ ఉంది. దీన్ని బస్సులు నడపడానికి ఉపయోగిస్తున్నారు.


ఆవు పేడ ఇంధనంతో బస్సుల నడుస్తున్నాయ్


ఈ బస్సులు ఆవు పేడతో అంటే బయో మీథేన్ గ్యాస్‌తో నడుస్తాయి. పాకిస్థాన్‌లో 4 లక్షలకు పైగా ఆవులు, గేదెలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు ఐక్యరాజ్యసమితి మద్దతు ఉన్న గ్రీన్ క్లైమేట్ ఫండ్ అండ్ ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ కూడా నిధులు సమకూర్చాయి. ఇందులో, బ్యాక్టీరియా, ఆవు పేడతో చర్య జరిపి మీథేన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయువులను ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత దీన్ని బస్‌డిపోలోని సీఎన్‌జీ ట్యాంకులకు తరలిస్తారు.


కాలుష్యం తగ్గుముఖం


ఇది మాత్రమే కాదు.. ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ పాకిస్థాన్‌లో వాయు కాలుష్యం, నీటి కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. పాల జంతువుల మలమూత్రాలు నదుల ద్వారా సముద్రంలోకి చేరుతాయి. దీంతో నీటి వనరు నిరంతరం మురికిగా మారుతోంది. ఓ నివేదిక ప్రకారం, పాకిస్థాన్‌లో ప్రతిరోజూ సుమారు 3,200 టన్నుల పేడ, మూత్రం సముద్రంలో కలుస్తున్నాయి. ఫ్లషింగ్, క్లీనింగ్ కోసం కూడా 50 వేల గ్యాలన్లకు పైగా నీరు వృథా అవుతుంది.


బస్సులలో ఆవు పేడ ఇంధనం వినియోగం


ఆవు పేడ ఇంధనాన్ని ఉపయోగించే బస్సులు కరాచీలోని 30 కిలోమీటర్ల కారిడార్‌లో నడుస్తున్నాయి. వీటి ద్వారా రోజూ వేలాది మంది ప్రయాణిస్తుంటారు. దీని కోసం, 25 కొత్త బస్ స్టేషన్లు కూడా నిర్మించారు, వీటిలో పాదచారుల క్రాసింగ్‌లు, సైకిల్ లేన్‌లు, బైక్ అద్దె సౌకర్యాలు కూడా ఉన్నాయి. కరాచీలో, ఈ బస్సులు ఆవు పేడ ఇంధనంతో విజయవంతంగా నడుస్తున్నాయి. అందిన సమాచారం ప్రకారం, ఇటువంటి బస్సులు లాహోర్, ముల్తాన్, పెషావర్, ఫైసలాబాద్ వంటి నగరాల రోడ్లపై త్వరలోనే నడుస్తాయి. ఇవి జీరో పర్సెంట్ పొల్యూషన్ ఉన్న గ్రీన్ బస్సులు. ఈ మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు సుమారు 583 మిలియన్ డాలర్లు. అందులో గ్రీన్ క్లైమేట్ ఫండ్ సుమారు 49 మిలియన్ డాలర్లు అందిస్తోంది. 


సాంప్రదాయకంగా ఆవు పేడను గ్రామీణ గృహాలలో గృహ ఇంధనంగా ఉపయోగిస్తారు. తాజా పేడను చదునైన గుళికలుగా తయారు చేసి, ఎండలో ఎండబెట్టి, గ్రామీణ భారతదేశంలో పాత రోజుల్లో వంట ఇంధనంగా ఉపయోగించేందుకు నిల్వ చేస్తారు. ఎండబెట్టడం వలన, పేడ దాని దుర్వాసనను కోల్పోతుంది. అందువల్ల ఇంధనం గృహ వినియోగానికి ఆమోదయోగ్యమైనది.


Also Read : One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?