పాకిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 22కు చేరింది. బలూచిస్తాన్ రాష్ట్రంలో సంభవించిన ఈ భూకంపం ధాటికి దాదాపు 200 మంది వరకు గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రజలు ఇళ్లలో నిద్రపోతుండగా భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7 గా నమోదైంది.
విద్యుత్ సరఫరా..
భూకంపం ధాటికి ఇళ్ల పైకప్పులు, గోడలు కూలిపోయాయని పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు. భూకంపం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆరోగ్య కార్యకర్తలు టార్చ్ లైట్ల సాయంతో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
మారుమూల పర్వత నగరమైన హర్నాయ్ కేంద్రంగా భూకంపం వచ్చింది. హర్నాయ్ ప్రాంతంలో రోడ్లు, విద్యుత్, మొబైల్ ఫోన్ కవరేజీ లేకపోవడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. క్షతగాత్రుల్లో చాలామందికి ఎముకలు విరిగిపోయాయని, 40 మందిని చికిత్స కోసం క్వెట్టా ఆసుపత్రికి పంపించామని హరనై ఆసుపత్రి అధికారి జహూర్ తారిన్ చెప్పారు.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ప్రజలు భయపడాల్సి పనిలేదని, సహాయక బృందాలకు తగిన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.
మరణించిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
Also Read: PM Modi 20 Years: మోదీ ప్రజాప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి.. ప్రధానికి శుభాకాంక్షల వెల్లువ