OYO Layoffs:
ఓయోలో 600 మందికి టాటా..
ఇప్పుడు టెక్ సెక్టార్‌లో బాగా వినిపిస్తున్న పదం "లే ఆఫ్‌లు". దాదాపు అన్ని దిగ్గజ కంపెనీలు ఇదే బాట పడుతున్నాయి. కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ కోతలు కూడా భారీగానే ఉంటున్నాయి. ఇప్పటికే ట్విటర్, అమెజాన్, ఫేస్‌బుక్ ఈ పని మొదలు పెట్టాయి. వేలాది మంది ఉద్యోగులు ఇంటి బాట పడుతున్నారు. ఇప్పుడీ జాబితాలో ఓయో (OYO) కంపెనీ కూడా చేరిపోయింది. ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల్లో 600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. కొన్ని ప్రాజెక్ట్‌లను నిలిపివేసి, అన్ని టీమ్‌లను మెర్జ్ చేస్తున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో..సేల్స్ టీమ్ కోసం కొత్తగా 250 మందిని రిక్రూట్ చేసుకుంటన్నట్టు వెల్లడించింది. రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కొత్త వాళ్లను కంపెనీలోకి తీసుకోనున్నట్టు పేర్కొంది. వచ్చే నెలలోగా ఈ రిక్రూట్‌మెంట్ పూర్తవనుంది. హోటల్స్ సంఖ్య పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసేందుకూ ప్రత్యేకంగా కొందరి ఉద్యోగులను నియమించుకోనుంది ఓయో.
దురదృష్టకరం...
ఈ లేఆఫ్‌లపై కంపెనీ సీఈవో రితేష్ అగర్వాల్ స్పందించారు. ఉద్యోగం కోల్పోయిన వారందరికీ వేరే కంపెనీల్లో జాబ్ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం వారికి ఎలాంటి సాయమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. "ఈ ఉద్యోగుల నైపుణ్యాలేంటో, సామర్థ్యాలంటే మా కంపెనీలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. కంపెనీ అభివృద్ధి కోసం పని చేసిన వీళ్లను ఉద్యోగం నుంచి తొలగించాల్సి రావడం దురదృష్టకరం. వీళ్లందించిన సేవలు ఎంతో విలువైనవి. మా కంపెనీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది. ఆ స్థాయిలో అవసరమైన ఉద్యోగులను వెతుక్కోవాల్సి వస్తోంది. అందుకే...ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. కొత్త వారికి అవకాశాలివ్వాలని అనుకుంటున్నాం" అని వెల్లడించారు. ఓయోలో ఇలా వందలాది మంది ఉద్యోగులను తొలగించడం రెండేళ్లలో ఇది రెండోసారి. 2020లో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో 300 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. సోషల్ మీడియా కంపెనీ షేర్ చాట్ కూడా లేఆఫ్‌లు మొదలు పెట్టింది. 2,300 మంది ఉద్యోగులున్న ఈ కంపెనీలో 5% మందిని తొలగిస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే 115 మందిని ఇంటికి పంపింది.
జొమాటోలోనూ..
ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఉద్యోగులకు షాకిచ్చింది! దేశ వ్యాప్తంగా 3 శాతం మందిని తొలగించినట్టు తెలిసింది. టెక్, సోషల్ మీడియా కంపెనీల బాటనే అనుసరించింది. రోజువారీ పనితీరును అనుసరించి బయటకు పంపించేశారని సమాచారం. 'రోజు వారీ పనితీరును అనుసరించి మా సంస్థలో 3 శాతం మందిని తొలగిస్తున్నాం. ఇంతకు మించి ఎవ్వర్నీ తీసేయం' అని జొమాటో అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఫుడ్ డెలివరీ యాప్ ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి కాదు. ప్రస్తుతం కంపెనీలో 3800 మంది పనిచేస్తుండగా 2020 మేలో 13 శాతం మంది అంటే 520 మందిపై వేటు వేసింది. కరోనా వైరస్ ఆవిర్భవించడం, లాక్‌డౌన్లు అమలు చేయడంతో ఇలా చేసింది. కొన్ని వారాల క్రితమే జొమాటో టాప్ లెవల్ ఉద్యోగులు బయటకు వెళ్లిపోయారు. వెంటనే లేఆఫ్‌లు మొదలయ్యాయి. కంపెనీ సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా కంపెనీని వీడారు.
Also Read: Congress Steering Committee: బాధ్యతగా ఉండాలి- లేకుంటే పార్టీని వీడాలి: ఖర్గే వార్నింగ్