Congress Steering Committee: మొదటి కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ (Congress Steering Committee) సమావేశం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సంస్థాగత జవాబుదారీతనం పై నుంచి క్షేత్ర స్థాయి వరకు ఉండాలన్నారు. తమ బాధ్యతలను నిర్వర్తించలేని వారు తప్పుకోవచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో రాబోయే 30 నుంచి 90 రోజుల్లో ప్రజల సమస్యలపై ఉద్యమానికి రోడ్ మ్యాప్‌ను సమర్పించాలని ఖర్గే రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లను కోరినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
జోడో యాత్ర
రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వంలో భారత్ జోడో యాత్ర చరిత్రను సృష్టిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు కొనియాడారు. దేశాన్ని విభజించాలనుకునే వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోందన్నారు.
భారత్ జోడో యాత్ర ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌లో ప్రవేశించనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ సమావేశంలో పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ నేతలు పీ చిదంబరం, ఆనంద్ శర్మ, మీరా కుమార్, అంబికా సోనీ తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్‌లో అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) స్థానంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ ఉన్నతాధికారులు కీలకమైన సంస్థాగత విషయాలను చర్చించడంతో పాటు ప్లీనరీ సమావేశాల షెడ్యూల్, వేదికపై చర్చలు జరుపుతున్నారు. ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడైన వెంటనే సీడబ్ల్యూసీ సభ్యులందరినీ స్టీరింగ్ కమిటీలో సభ్యులుగా చేర్చారు.
Also Read: All Party Meeting: సోమవారం అఖిలపక్ష భేటీ- 40 పార్టీలకు కేంద్రం ఆహ్వానం