Canada Visas Delay:
దౌత్యవేత్తల్ని తొలగించిన కెనడా..
భారత్‌లో 41 మంది దౌత్యవేత్తల్ని తొలగించింది కెనడా. భారత్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. క్రమంగా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకోవాలని గతంలోనే భారత్ హెచ్చరించింది. అప్పటి నుంచి విడతల వారీగా వాళ్లను తొలగిస్తూ వస్తోంది. అక్టోబర్ 20వ తేదీలోగా వీళ్లను తొలగించకపోతే రెండు దేశాల మధ్య ఇప్పుడున్న మైత్రి కూడా చెడిపోతుందని వార్నింగ్ ఇచ్చింది భారత్.
"భారత్ ఆదేశాల మేరకు క్రమంగా ఇండియాలోని కెనడా దౌత్యవేత్తల సంఖ్యని తగ్గిస్తున్నాం. అక్టోబర్ 20వ తేదీలోగా వీళ్ల సంఖ్యని తగ్గించాలని భారత్ ఆదేశించింది. ఈ మేరకు ఇమిగ్రేషన్, రెఫ్యూజిస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) ఇండియాలోని ఉద్యోగుల సంఖ్యని 27 నుంచి 5కి తగ్గించింది. ఇండియా నుంచి వచ్చే అప్లికేషన్స్‌ని మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ...స్టాఫ్ సంఖ్యని తగ్గిస్తున్నాం. ఈ కారణంగా ప్రాసెసింగ్ టైమ్‌పై ప్రభావం పడుతుంది"
- ఇమిగ్రేషన్, రెఫ్యూజిస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా
స్పందించిన విదేశాంగ శాఖ..
మొత్తంగా భారత్‌లో 42 మంది దౌత్యవేత్తలున్నట్టు కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జాలీ వెల్లడించారు. వీళ్లలో 41 మందిని వెనక్కి రప్పించింది. వీసా అప్లికేషన్‌ల ప్రాసెసింగ్‌లో జాప్యం కారణంగా భారతీయులకు వీసాలు జారీ చేయడంలో కాస్త ఆలస్యమవుతుందని కెనడా ప్రకటించింది. సిబ్బందిని తొలగించినప్పటికీ రోజువారీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయితే...ఈ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. దాదాపు నెల రోజులుగా కెనడాతో దౌత్య చర్యలు జరుపుతున్నట్టు ప్రకటించింది. దౌత్య సంబంధాలకు సంబంధించిన Vienna Convention ప్రకారమే నడుచుకుంటున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఊరుకోం అని హెచ్చరించింది.