సచిన్‌ టెండూల్కర్‌... ప్రపంచ క్రికెట్‌ అభిమానులను రెండు దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన పేరు. సచిన్‌ను దేవుడిలా ఆరాధించేవాళ్లు కోట్లలో ఉన్నారు. కొన్నేళ్ల పాటు భారత బ్యాటింగ్‌ భారాన్ని తన భుజ స్కందాలపై మోసిన దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌. క్రికెట్‌ గాడ్‌ అని.. మాస్టర్‌ బ్లాస్టర్‌ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు.భారత క్రికెట్‌ చరిత్రలోనే కాక ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనూ సచిన్‌ది ఓ ప్రత్యేక స్థానం. 


సచిన్ కు ముందు, తర్వాత


క్రికెట్.. సచిన్‌కు ముందు.. సచిన్‌కు తర్వాత అన్నది దిగ్గజాల మాట. క్రికెట్‌లో సచిన్‌ని దేవుడిగా కొలిచే వాళ్లలో అభిమానులే కాదు.. క్రికెటర్లూ ఉన్నారు. ధోనీ దగ్గర నుంచి కోహ్లీ వరకు అందరూ సచిన్‌ను ఆరాధిస్తూ పెరిగిన వాళ్లే. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నా.. ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్ష్యంగా నిలిచినా అది ఒక్క సచిన్‌కే చెల్లింది. క్రికెట్‌ ప్రపంచంలో శత శతకాలు సాధించి ఔరా అనిపించిన సచిన్‌ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరనుంది. భారత్‌లో తొలి టెస్టు జట్టు కెప్టెన్‌ సీకే నాయుడుకు మాత్రమే విగ్రహాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ అరుదైన గౌరవం సచిన్‌కే దక్కింది. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని నవంబర్‌ 2న ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ అమోల్ కాలే ప్రకటించారు. సచిన్ టెండూల్కర్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని నవంబర్ 2 న శ్రీలంకతో టీమిండియా ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సచిన్‌ విగ్రహ ప్రారంభోత్సవ సంబరానికి పలువురు ప్రముఖులు, భారత జట్టు సభ్యులు కూడా హాజరవుతారని ప్రకటించారు. సచిన్‌ విగ్రహ ప్రారంభానికి షెడ్యూల్‌ను.. సమయాన్ని ఖరారు చేశామని వివరించారు. చారిత్రక వాంఖడే స్టేడియంలో ఒక ఆటగాడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇది తొలిసారని కాలే తెలిపారు. ఇప్పటికే వాంఖడే స్టేడియంలో సచిన్ పేరు మీద ఓ స్టాండ్ కూడా ఉంది. సచిన్‌తోపాటు సునీల్ గవాస్కర్‌, దిలీప్ వెంగ్‌సర్కార్‌ పేర్ల మీద కూడా వాంఖడేలో స్టాండ్లు ఉన్నాయి. 


సచిన్ భావోద్వేగం


వాంఖడేలో తన విగ్రహం ఏర్పాటు చేయడంపై సచిన్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఎంసీఏ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. వాంఖడేతో తన అనుబంధం ఇప్పటిది కాదన్న సచిన్‌, తన తొలి రంజీ మ్యాచ్‌ను ఇక్కడే ఆడానని గుర్తు చేసుకున్నాడు. ఆచ్రేకర్‌ సర్, తనను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారిపోయానని... ఇక్కడే తన చివరి మ్యాచ్‌నూ ఆడానని గుర్తు చేసుకున్నాడు. వాంఖడేకి వస్తే తన జీవిత చక్రం మొత్తం కళ్ల ముందు కనిపిస్తుందన్నాడు. తన జీవితంలో అతి పెద్ద ఘటనగా విగ్రహావిష్కరణ నిలిచిపోతుందని సచిన్ అన్నాడు. ఇలాంటి గొప్ప గౌరవం అందించిన ఎంసీఏకి క్రికెట్‌ ధన్యవాదాలు తెలిపాడు.


సచిన్ రికార్డులు


సచిన్ భారత్ తరఫున 200 టెస్టు మ్యాచ్‌లు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (100) , పరుగులు 34,357 చేశాడు. ఏప్రిల్ 24,1973లో ముంబైలో జన్మించిన సచిన్, 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. టెస్ట్, వన్డే, టీ20 లో మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు.