Vinesh Phogat Disqualification: వినేశ్ ఫోగాట్‌పై ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడడం, ఆ తరవాత ఆమె రెజ్లింగ్‌కి గుడ్‌బై చెప్పడం వెను వెంటనే జరిగిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీటిపైనే చర్చ. 100 గ్రాముల బరువు ఎక్కువుంటే పోటీ నుంచి తప్పించేస్తారా అంటూ సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. ఇక ఈ అంశం రాజకీయాలనూ కుదిపేసింది. ఇదంతా కుట్ర అని ఇండీ కూటమి నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పార్లమెంట్‌లో ఈ వ్యవహారం గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఈ అసహనంతోనే ఇండీ కూటమి నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. రాజ్యసభలో నిరసన వ్యక్తం చేసిన ఎంపీలు ఆ తరవాత బయటకు వచ్చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాళ్లు ఆరోపిస్తున్నారు. అయితే..ఇండీ కూటమి నేతల తీరుపై రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వినేశ్ ఫోగట్‌కి ఇలా జరగడంపై దేశమంతా బాధ పడుతోందని, అనవసరంగా దీన్ని రాజకీయం చేసి ఆమెని అవమానించొద్దని మందలించారు. (Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌లో ఇండియన్ వీసా సెంటర్‌లు మూసివేత, అల్లర్లు సద్దుమణిగే వరకూ సేవలు బంద్)
"వినేశ్ ఫోగట్‌పై అనర్హతా వేటు పడడంపై దేశమంతా చింతిస్తోంది. కేవలం మీకు మాత్రమే బాధ ఉన్నట్టుగా వ్యవహరించడం సరి కాదు. అందరూ వినేశ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ దీన్ని ఇలా రాజకీయం చేసి ఆమె గౌరవాన్ని తగ్గించకూడదు. ఆమె సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది"
- జగ్‌దీప్ ధన్‌కర్, రాజ్యసభ ఛైర్మన్
క్రీడా మంత్రి ప్రకటన..
ఇప్పటికే కేంద్ర క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవియ లోక్‌సభ వేదికగా ఈ వివాదంపై ఓ ప్రకటన చేశారు. వినేశ్ ఫోగట్‌కి అన్ని విధాలుగా ప్రభుత్వం తరపు సహకారం అందిందని స్పష్టం చేశారు. పారిస్ ఒలింపిక్స్ కోసం రూ.70 లక్షలకు పైగా ఆర్థిక ప్రోత్సాహకమూ అందించినట్టు బీజేపీ సీనియర్ నేతలు కొందరు వెల్లడించారు. నిబంధనల ప్రకారమే ఆమెని తప్పించారని మన్‌సుఖ్ మాండవియ తెలిపారు. బరువు విషయంలో వాళ్లు చాలా కచ్చితంగా ఉంటారని స్పష్టం చేశారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్‌ని ఆదేశించారు. అవసరమైతే తీవ్ర నిరసన తెలిపైనా ప్రత్యమ్నాయాలు ఆలోచించాలని అన్నారు. ఈ ఆదేశాల మేరకు IOA అనర్హాత వేటు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
Also Read: Vinesh Phogat Retires: "పోరాడే బలం, ధైర్యం లేవు" రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్ ఫొగాట్