Indian Visa Centres in Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇప్పట్లో కుదురుకునేలా లేవు. వేలాది మంది హిందువులపైనా అక్కడ దాడులు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ ఈ అల్లర్లు సద్దుమణగడానికి సమయం పట్టేలా ఉంది. ఈ క్రమంలోనే భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌లోని ఇండియన్ వీసా సెంటర్‌లను మూసేస్తున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం అక్కడి అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. Indian Visa Application Centre ఈ మేరకు వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన చేసింది. అప్లికెంట్స్ అందరికీ త్వరలోనే SMS ద్వారా పూర్తి వివరాలు పంపుతామని తెలిపింది. సెంటర్ తెరుచుకున్నాకే పాస్‌పోర్ట్స్‌ కలెక్ట్ చేసుకోవాలని వెల్లడించింది. 


"బంగ్లాదేశ్‌లోని ఇండియన్ వీసా సెంటర్‌లను తాత్కాలికంగా మూసేస్తున్నాం. మళ్లీ ఎప్పుడు తెరుస్తామన్నది త్వరలోనే వెల్లడిస్తాం.  తరవాతి అప్లికేషన్ డేట్ ఎప్పుడన్నది SMS ద్వారా తెలియజేస్తాం. సెంటర్‌లను తెరిచాక పాస్‌పోర్ట్‌లు కలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాం"


- అధికారులు


ధాకాలోని ఇండియన్ హై కమిషన్‌లో మొత్తం 190 మంది సాధారణ సిబ్బందితో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు వెంటనే భారత్‌కి వచ్చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వీళ్లంతా ఇండియాకి చేరుకున్నారు. అయితే..మిగతా దౌత్యవేత్తలంతా బంగ్లాదేశ్‌లో ఉన్నారు. ధాకాతో పాటు చిట్టగాంగ్, ఖుల్నా, సిల్హెట్‌, రాజ్‌షాహీల్లో భారత్‌కి సంబంధించిన రాయబార కార్యాలయాలున్నాయి. దాదాపు నెల రోజులుగా బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్‌ల కోటా గురించి మొదలైన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఫలితంగా దేశ ప్రధాని షేక్ హసీనా 15 ఏళ్ల పాలనకు తెరపడింది. ఆమె ఆ పదవికి రాజీనామా చేసి ఇండియాలో ఆశ్రయం కోసం వచ్చారు. కానీ ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ అంగీకరించలేదు. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. 


Also Read: Waqf Bill 2024: వక్ఫ్ బోర్డుల పరిధిలో లక్షల ఎకరాలు, రైల్వే డిఫెన్స్ తరవాత వాటా వీటిదే - మోదీ సర్కార్ టార్గెట్ అదే!