Vinesh Phogat Announces Retirement: 100 గ్రాముల అధిక బరువుతో ఒలింపిక్‌ పతకం కోల్పోయి తీవ్ర నిర్వేదంలో ఉన్న భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌(Vinesh Phogat) సంచలన ప్రకటన చేసింది. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. రిటైర్‌ మెంట్‌ ప్రకటన చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఇక పోరాడే బలం లేదంటూ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో వినేశ్‌ పోస్ట్‌ పెట్టింది. రెజ్లింగ్‌ తనపై గెలిచిందని... తాను ఓడిపోయానని ఈ పోస్ట్‌లో వినేశ్‌ పేర్కొంది. మీ కల, తన ధైర్యం రెండు విచ్చినమైయ్యాయని... ఇక తనకు పోరాడే బలం కుడా లేదని వినేశ్‌ ఆ పోస్ట్‌ల పేర్కొంది. ఈ ప్రకటనతో భారత రెజ్లింగ్‌లో ఓ పోరాట యోధురాలి శకం ముగిసింది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచి తన కెరీర్‌కు ఘనంగా ముగింపు పలకాలని భావించిన వినేశ్‌... ఇప్పుడు తీవ్ర నిర్వేదంతో ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 

 

ఆర్బిట్రేషన్‌ కోర్టుకు... 

ఒలింపిక్స్‌లో 50 కేజీల మహిళల విభాగంలో ఫైనల్‌ పోరుకు ముందు 100 గ్రాముల అదనపు బరువుతో అనర్హత గురైన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్)ను ఆశ్రయించింది. సెమీస్‌ గెలిచి ఫైనల్‌కు వెళ్లిన తనకు సిల్వర్‌ మెడల్‌ ఇవ్వాలని ఫిర్యాదులో కోరింది.  దీనికి సంబంధించి సీఏఎస్‌ ఆగస్టు 8న తీర్పు ఇవ్వనుంది. సీఏఎస్‌ రూల్స్‌ వినేశ్‌కు అనుకూలంగా వస్తే భారత్‌కు మరో పతకం
  

క్రీడల్లో వివాదాలకు సంబంధించి ఆర్బిట్రేషన్‌ కోర్టును 1984లో ఏర్పాటు చేశారు. తను సిల్వర్‌ మెడల్‌కు అర్హురాలినని ఫిర్యాదులో వినేశ్‌ పేర్కొందని తెలుస్తోంది. ఆర్భిట్రేషన్‌ తీర్పు రావాల్సి ఉండగానే వినేశ్‌ ఈ రిటైర్‌మెంట్‌ నిర్ణయం తీసుకుని అభిమానులకు వేదనను మిగిల్చింది. 

 

నిబంధనల మేరకే

యునైటెడ్‌ ప్రపంచ రెజ్లింగ్‌ ఒలింపిక్స్‌ నిబంధనల ప్రకారం రెజ్లింగ్‌ మ్యాచ్‌ జరగనున్న రోజు ఉదయం రెజ్లర్ల బరువును కొలుస్తారు. మ్యాచ్‌ ఆరంభం తొలి రోజు వైద్య పరీక్షలకు, బరువును కొలుచుకునేందుకు రెజ్లర్లకు అరగంట సమయం ఇస్తారు. మంగళవారం వినేశ్‌ బరువు 50 కేజీల కంటే ఎక్కువ లేకపోవడంతో ఆమె రెజ్లింగ్‌లో బరిలోకి దిగి అద్భుతాలు చేసింది. అయితే బుధవారం ఉదయం వినేశ్‌ 100 గ్రాముల బరువు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో ఒక్క గ్రాము అధికంగా ఉన్నా అలాంటి రెజ్లర్లు బరిలోకి దిగేందుకు అర్హత లేదు. అందుకే వినేశ్‌పై అనర్హత వేటు పడింది. కనీసం రజత పతకంతో అయినా భారత్‌కు వస్తుందనుకున్న వినేశ్‌.. అనర్హురాలిగా తేలి పతకానికి దూరమవడంతో భారత అభిమానులను  తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మ్యాచ్‌ రోజున ఎక్కువ బరువు ఉండే రెజ్లర్లను పోటీల నుంచి తప్పించి, చివరి స్థానం ఇస్తారు.