NEET Controversy 2024: నీట్ వ్యవహారం పార్లమెంట్‌ని కుదిపేస్తోంది. లోక్‌సభలో ఈ వివాదంపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాసేపు సభలో గందరగోళం నెలకొంది. సభా వేదికగా మోదీ ప్రభుత్వం విద్యార్థులను ఉద్దేశించి ఓ ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తక్షణమే చర్చ జరగాలని పట్టుబట్టారు. అయితే...రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం తరవాత చర్చిద్దామని స్పీకర్ ఓం బిర్లా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ...వెంటనే చర్చ జరగాల్సిందే అని విపక్షాలు తేల్చి చెప్పాయి. ఈ వివాదంపై చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. National Testing Agency (NTA) లోని వైఫల్యాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని విపక్షాలు చెబుతున్నాయి. ఇప్పటికే విపక్షాలు ఈ వ్యవహారంపై స్పీకర్‌కి 22 నోటీసులిచ్చాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విద్యార్థుల భవిష్యత్‌ ఏంటని ప్రశ్నించారు. ప్రశాంతంగా చర్చించాల్సిన అవసరముందని అన్నారు. ఈ క్రమంలోనే లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఈ వివాదం అలజడి సృష్టించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చర్చకు డిమాండ్ చేశారు. రాజ్యసభ కూడా వాయిదా పడుతూ వస్తోంది. 


"నీట్ వ్యవహారంపై చర్చ జరగాల్సిందే. ఇదే విషయాన్ని మేమంతా సమావేశమై నిర్ణయించుకున్నాం. ప్రధాని నరేంద్ర మోదీకి ఇదే నా విజ్ఞప్తి. దయచేసి ఈ వివాదంపై మాట్లాడాలి. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా సభా వేదికగా ఓ ప్రకటన చేయాల్సిన అవసరముంది. ప్రశాంతంగా చర్చ జరగాలి. మేమీ విషయంలో చాలా మర్యాదగానే వ్యవహరించాలని అనుకుంటున్నాం. అంతే గౌరవప్రదంగా ప్రభుత్వం చర్చిస్తే బాగుంటుంది. విద్యార్థులను ఉద్దేశించి పార్లమెంట్ నుంచి ఓ సందేశం ఇవ్వాల్సిన అవసరముంది"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ






 రాహుల్‌తో పాటు మరి కొందరు ఎంపీలూ చర్చకు పట్టుబట్టారు. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పేపర్‌ లీక్‌ల కారణంగా దేశంలోని విద్యార్థుల భవిష్యత్‌ నాశనం అవుతోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి మాత్రం ఈ తప్పుల నుంచి దూరంగా పారిపోతున్నారని మండిపడ్డారు. అందుకే సభలో చర్చ జరిపాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై కచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు. అయితే...ఈ వివాదంపై చర్చ జరిపేందుకు సిద్ధంగానే ఉన్నామని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. 


"ఈ వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా వద్ద ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై చర్చించేందుకు సిద్ధంగా ఉంది. కానీ సభా కార్యకలాపాలకు ఇలా అడ్డుతగలడం సరికాదు. కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగకూడదు"


- కిరణ్ రిజిజు, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి 


Also Read: Hemant Soren: ఝార్ఘండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కి ఊరట, ల్యాండ్ స్కామ్ కేసులో బెయిల్