Hemant Soren: ఝార్ఘండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కి భారీ ఊరట లభించింది. ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ఇదే కేసులో జనవరి 31న సోరెన్ అరెస్ట్ అయ్యారు. 8.36 ఎకరాల ల్యాండ్ కొనుగోలు విషయంలో అవకతవకలు ఈడీ తేల్చి చెప్పింది. ఈ కేసులో ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరవాత చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. పెండింగ్ కేసులు ఏమీ లేకపోవడం వల్ల ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. ల్యాండ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భాను ప్రతాప్ ప్రసాద్‌నీ ఇప్పటికే అరెస్ట్ చేశారు. 2023లో ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ని తారుమారు చేశారు. ఆయనను అరెస్ట్ చేసిన తరవాత డాక్యుమెంట్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. హేమంత్ సోరెన్ 8.36 ఎకరాల ల్యాండ్‌ని అక్రమంగా కొనుగోలు చేసినట్టు తేలింది. ఈ వ్యవహారంలో భాను ప్రతాప్ సహకరించాడు. ఇప్పటికే ఈడీ మరి కొన్ని కేసులనూ విచారిస్తోంది.
బెయిల్ మంజూరు అవడంతో హేమంత్ సోరెన్ ఇంటి వద్ద సందడి నెలకొంది. ఆయన సన్నిహితులు అందరికీ మిఠాయిలు పంచి పెట్టారు. బెయిల్ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.