Turkey Thanks India: 


భారీ సాయం..


భూకంప ధాటికి చెల్లాచెదురైన టర్కీకి పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది భారత్. ఆపరేషన్ దోస్త్ పేరిట సహాయక చర్యల్లో పాల్గొంటోంది. NDRF బృందాలు అక్కడి రెస్క్యూ ఆపరేషన్‌కు సహకరిస్తున్నాయి. దీనిపై టర్కీ పౌరులు సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌కు థాంక్స్ చెప్పారు. భారత్‌ నుంచి NDRFబృందాలు వచ్చి తమకు ఎంతో సాయం చేస్తున్నాయని, అండగా ఉంటున్నారని ఆనందంగా చెప్పారు.


"ఇప్పుడే ఇండియా నుంచి సహాయక బృందాలు వచ్చాయి. మాకు ఎంతో సాయ చేశాయి. మేం ఒంటరిగా మిగిలిపోతామేమో అని భయపడ్డాం. కానీ వీళ్లు వచ్చాక మాకు దైర్యం వచ్చింది. మీ మద్దతు మేమెప్పటికీ రుణపడి ఉంటాం. థాంక్యూ. గాడ్ బ్లెస్ యూ." 


-టర్కీ పౌరులు 






మెడికల్‌ సప్లై..


NDRF సిబ్బంది శిథిలాల కింద నలిగిపోతున్న వారిని గుర్తించి బయటకు తీస్తున్నారు. ఓ ఆరేళ్ల చిన్నారితో పాటు 8 ఏళ్ల చిన్నారినీ కాపాడారు. ఇండియా నుంచి ప్రత్యేక విమానాల్లో మెడికల్ సప్లైస్‌ ఇప్పటికే అందుతున్నాయి. అక్కడే మొబైల్ హాస్పిటల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ రెస్క్యూ టీమ్ కూడా అక్కడికి వెళ్లింది. లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌, క్రిటికల్ కేర్ ఎక్విప్‌మెంట్‌నూ అందిస్తోంది. రూ.7 కోట్ల విలువైన పరికరాలనూ అందించి అక్కడి వారికి అండగా నిలబడుతోంది. 5,495 టన్నుల ఎమర్జెన్సీ రిలీఫ్ మెటీరియల్ అందించింది. అటు సిరియాకు కూడా ఇదే స్థాయిలో సాయం అందిస్తోంది భారత్. 


దయనీయ స్థితిలో..


టర్కీ, సిరియాలో భూకంప బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గంటల కొద్ది శిథిలాల కింద నలిగిపోయిన వారిని గుర్తించి కాపాడుతున్నాయి బృందాలు. ఈ క్రమంలోనే టర్కీలో దాదాపు 278 గంటల పాటు శిథిలాల కిందే చిక్కుకుని నరకయాతన అనుభవించిన ఓ 45 ఏళ్ల వ్యక్తిని కాపాడారు. భూకంపం వచ్చిన రోజునే ఇలా శిథిలాల కింద ఇరుక్కుపోయాడా వ్యక్తి. అప్పటి నుంచి సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. 12 రోజుల తరవాత ఆయనను గుర్తించిన సిబ్బంది సురక్షితంగా బయటకు తీసింది. ఇలా చాలా మంది రోజుల పాటు ఇలా శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బయటకు వచ్చే దారి తెలియక ఆకలితో నకనకలాడిపోతున్నారు. 278 గంటల తరవాత ఆ వ్యక్తిని బయటకు తీసి ఓ స్ట్రెచర్‌పై తీసుకొచ్చింది సిబ్బంది. గోల్డెన్ థర్మల్ జాకెట్ కప్పి స్ట్రెచర్‌కు కట్టేసి సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ఆంబులెన్స్‌లోకి ఎక్కించి ఆసుపత్రికి  తరలించారు. అయితే ఆ వ్యక్తి ముఖం మాత్రం బయటకు కనబడలేదు. అంతకు ముందు ఎంతో శ్రమించి 14 ఏళ్ల బాలుడిని కాపాడారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు టర్కీ వైస్‌ ప్రెసిడెంట్ వెల్లడించారు. ఇప్పటికే టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 41 వేలు దాటింది. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్షలాది మంది ఎలాంటి షెల్టర్‌ లేకుండా చలిలోనే వణికిపోతున్నారు. 


Also Read: BBC IT Raid: ఉద్యోగుల ఫోన్‌లు లాక్కున్నారు, కొందరిని ఇబ్బంది పెట్టారు - ఐటీ అధికారులపై బీబీసీ ఆరోపణలు