మహా శివరాత్రి సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో శుభాకాంక్షలు తెలిపిన తీరు వివాదాస్పదంగా మారింది. దీనిపై ఏపీ బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బాల శివుడికి సీఎం వైఎస్ జగన్ పాలు తాగిస్తున్న కంప్యూటర్ గ్రాఫిక్స్ ఫోటో ఒకటి ట్విటర్ లో వైఎస్ఆర్ సీపీ విడుదల చేసింది. దీనిపై మహా శివరాత్రి నాడు అపచారం అంటూ బీజేపీ రంగంలోకి దిగింది. ఆ ఫోటో ట్వీట్‌ చేసి ‘‘అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధన. ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో శనివారం నాడు (ఫిబ్రవరి 18) అధికారికంగా ట్వీట్ చేసింది.
 
వైఎస్ఆర్ సీపీ తెలిపిన ఈ తీరు పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. ఆ ఫోటోలో వైఎస్ జగన్ పాలు తాగిస్తున్న బాలుడు శివుడి తరహాలో పులి చర్మం ధరించి, చేతిలో ఢమరుకం, నుదుటన నామాలతో ఉండగా దాన్ని సోము వీర్రాజు తప్పుబట్టారు.






ఈ ఫోటోపై ఆయన ట్విటర్ ద్వారానే స్పందిస్తూ.. ‘‘పేద వాళ్ళు అని పేర్కొంటూనే చేతిలో ఢమరుకాన్ని చిత్రీకరించిన చర్య హైందవ ధర్మం మరియు హిందువుల మనోభావాల పట్ల వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం యొక్క చులకన భావానికి ప్రతీక, ఇలాంటి ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ హైందవ సమాజానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్ సీపీని డిమాండ్ చేస్తున్నాను’’ అని సోము వీర్రాజు తన సొంత ట్విటర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. దీనికి బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌ను, వైఎస్ఆర్ సీపీ అధికారిక ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేశారు.






అయితే, ఈ ట్వీట్‌కు కామెంట్లను టర్న్ ఆఫ్ చేశారు. కేవలం సోము వీర్రాజు ట్వీట్‌లో ట్యాగ్ చేసిన వారు మాత్రమే స్పందించేందుకు వీలుంది. కానీ, ఇంత వరకూ దీనికి కౌంటర్‌గా వైఎస్ఆర్ సీపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.


వైఎస్ జగన్ కూడా శుభాకాంక్షలు


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వ్యక్తిగత ట్విటర్ అకౌంట్ నుంచి కూడా ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచు కుంటున్న పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు.