Operation Dost:


ఆపరేషన్ దోస్త్..


టర్కీ సిరియాలో భూకంపం ఎంత నష్టాన్ని మిగిల్చిందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే 9 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు అక్కడి అధికారులు. వేలాది మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాల్లో ఎక్కడ చూసినా రోదనలే వినిపిస్తున్నాయి. తమ వారు ఎక్కడున్నారో అని కళ్లల్లో వత్తులు వేసుకుని అన్ని చోట్లా వెతుకుతున్నారు. చిన్నారులూ ఈ శిథిలాల కింద నలిగిపోయారు. ఈ దీనస్థితిని గమనించిన భారత్...ఆ రెండు దేశాలకూ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. "ఆపరేషన్ దోస్త్" పేరిట ఈ సహాయక చర్యలు అందిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో భారత్ అండగా ఉండేందుకు సిద్ధమైంది. విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆపరేషన్‌ దోస్త్‌లో భాగంగా...టర్కీ, సిరియాకు సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. 


"ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య సంబంధాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. కానీ భారత్ మాత్రం అన్ని దేశాలతోనూ స్థిరమైన బంధాన్ని కొనసాగిస్తోంది. వసుధైవ కుటుంబం అనే సూత్రానికి కట్టుబడిన భారత్...మానవత్వంతో సాయం అవసరమైన వారికి అండగా నిలబడుతుంది" 


-జైశంకర్, విదేశాంగ మంత్రి 










థాంక్స్ చెప్పిన టర్కీ..


ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్...ప్రత్యేక విమానాల్లో భారీ ఎత్తున మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను పంపుతోంది. ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్‌కి చెందిన 54 మంది సిబ్బంది కూడా ఈ విమానాల్లో వెళ్తోంది. వైద్య పరమైన సాయం అందించేందుకు ముందుంటామని వెల్లడించింది. ఇలాంటి కష్టకాలంలో భారత్‌ సాయం చేస్తుండటంపై టర్కీ కృతజ్ఞతలు తెలిపింది. భారత్‌ను "దోస్త్"గా వ్యవహరించింది. దోస్త్‌ అనే పదం టర్కిష్‌లో ఎక్కువగా వాడతారు. అదే పదాన్ని కోట్ చేస్తూ ఆ దేశానికి చెందిన ప్రతినిధులు భారత్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఫిబ్రవరి 6న కహ్రామన్‌మరాస్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత, ఇప్పటి వరకు మొత్తం 435 భూకంపాలు నమోదయ్యాయని టర్కీ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. భూకంపం సంభవించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 60,217 మంది సిబ్బందితోపాటు 4,746 వాహనాలు, నిర్మాణ సామగ్రిని సహాయక చర్యలు చేపట్టామని టర్కీ ప్రభుత్వం వెల్లడించింది. టర్కీలో భూకంపం సంభవించిన తరువాత, ప్రపంచ దేశాలు సహాయం అందించాయి. మొత్తం 70 దేశాల నుంచి సహాయక బృందాలు టర్కీకి చేరుకున్నాయి. టర్కీ వాతావరణం సహాయ బృందాలకు ఇబ్బంది కలిగిస్తోంది.


Also Read: Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు