Cow Hug Day:


ఆవుల్ని కౌగిలించుకోండి..


కేంద్ర పశుసంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవానికి బదులుగా "Cow Hug Day" జరుపుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. వాలెంటైన్స్ డే...పాశ్చాత్య సంస్కృతికి చెందిందని..
దానికి బదులుగా ఆవుని కౌగిలించుకుని వాటితో మన బంధాన్ని  బల పరుచుకోవాలంటూ పిలుపునిచ్చింది. భారతదేశ సంస్కృతిలో ఆవులకు ప్రత్యేక స్థానముంది. "గోమాత" అని కొలుస్తారు కూడా. 


"భారత దేశ ఆర్థిక వ్యవస్థకు, సంస్కృతికి ఆవులే వెన్నెముక లాంటివి. వాటితోనే మన మనుగడ కొనసాగుతోంది. జీవ వైవిధ్యానికి అవి ప్రతీకలు. అందుకే కామధేను, గోమాత అని రకరకాల పేర్లతో పిలుచుకుంటాం. అమ్మలా మనకు అన్నీ సమకూర్చుతుంది. మానవత్వాన్నీ కాపాడుతుంది. గోమాతను పూజించే వాళ్లందరూ ఫిబ్రవరి 14వ తేదీన Cow Hug Day జరుపుకోండి. గోమాత ప్రాధాన్యతను గుర్తించండి"


- పశు సంక్షేమ శాఖ 


పాశ్చాత్య సంస్కృతి కారణంగా వేద మంత్రాలు కూడా వినబడకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది కేంద్రం. దేశ సంస్కృతిని కాపాడుకునేందుకు ఇలాంటివి జరుపుకోవాలని సూచించింది. భారతీయులకు, గోవులకు ఉన్న విడదీయలేని అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పశు సంక్షేమ శాఖ లీగల్ అడ్వైజర్ వెల్లడించారు. ఆవుల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు.