Onion Price Decrease: ఓవైపు కూరగాయల ధరలు మండుతున్నాయి. ముఖ్యంగా టమాటా, పచ్చి మిర్చి సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే.. మహారాష్ట్రలోని నవీ ముంబయిలో ఉల్లిగడ్డ ధర దారుణంగా పడిపోయింది. 15 నుంచి 30 రూపాయలకు కిలో ఉన్న ఉల్లిపాయలు ఏకంగా మూడు రూపాయలకు పడిపోయింది. ఇందుకు కారణం వర్షాలే అని తెలుస్తోంది. విపరీతమైన వర్షాలు కురవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఓవైపు కిలో టమాట ధర 120కి చేరుకోగా.. ఉల్లిగడ్డ మాత్రం రూ.3 కు పడిపోయింది.


టన్నుల కొద్దీ తడిసిపోయిన ఉల్లిగడ్డలు..!


మహారాష్ట్రలోని వాశిలో వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) ఉల్లిగడ్డ - బంగాళదుంప మార్కెట్‌లో టన్నుల కొద్దీ ఉల్లిపాయలు వర్షంలో తడిసిపోవడంతో వ్యాపారులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. మార్కెట్‌కు తీసుకొచ్చిన పంటకు నష్టం వాటిల్లింది. అయితే మార్కెట్ కు రైతులు పంటను తీసుకురాగా.. వర్షంలో పంట చాలా వరకు తడిసిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే చాలా తక్కువ మంది వినియోగదారులు మార్కెట్ కు వచ్చారని వివరించారు. సోమవారం ఒక్కరోజే మొత్తం 84 లారీల ఉల్లి మార్కెట్‌కు వచ్చినట్లు ఓ వ్యాపారి తెలిపారు. అలాగే వాటిలో చాలా వరకు తడిసిపోయిందని... సూపర్ క్వాలిటీ ధర కిలో 12 నుంచి 15 రూపాయలు పలుకుతుండగా, మీడియం ఉల్లిగడ్డల ధర 5 నుంచి 8 రూపాయలకు వరకు ఉంది. కానీ వర్షాల కారణంగా పాడైన ఉల్లిని ఒక్క రూపాయి నుంచి మూడు రూపాయలుగా చెల్లిస్తున్నారు. 


ఇప్పటికే మార్కెట్ లో మరో నెల రోజులకు సరిపడా ఉల్లి


నార్మల్ గా దొరికే ఉల్లి రకానికి కిలో మూడు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మార్కెట్ కు ఉల్లిపాయల రాక ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాబోయే నెల రోజులకు సరిపడా ఉల్లి... మార్కెట్ లో ఉందని, అందుకే ధర పలకటం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వమే ఉల్లి రైతులను ఆదుకోవాలని కోరుతూ నాసిక్ మార్కెట్ యార్డు వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


మరోవైపు పెరిగిపోయిన టమాటా ధర


కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాట మంట పెడుతోంది. ఏకంగా కొన్ని ప్రాంతాల్లో కిలో టమాట రూ.100 ధర పలుకుతోంది. సామాన్యులు కూరగాయలు కొనాలంటే జంకుతున్నారు. ప్రతి కూరలో అత్యవసరమైన టమాట అధిక ధర పలుకుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక మార్కెట్లలో కిలో టమాట ధర రూ.100 పలుకుతోంది. కొన్ని మార్కెట్లలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. గత నెలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలతోపాటు దేశమంతటా కిలో టమాటా రూ.2-5 మధ్య పలికింది. ఇప్పుడు కిలో టమాటా ధర కేవలం నెల రోజుల్లో 1900 రెట్లు పెరిగింది. దిల్లీ మార్కెట్లలో కిలో టమోటా రూ.70-100 మధ్య విక్రయిస్తున్నారు. మధ్య ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలో రూ.80-100 మధ్య ఉండగా, రాజస్థా్న్‌లో రూ.90 నుంచి రూ.110 మధ్య పలుకుతున్నాయి. డిమాండ్ కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో కూరగాయల మార్కెట్ లో టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో మొన్నటి వరకు వేడితో ప్రతికూల వాతావరణంలో ఉత్పత్తి తగ్గినట్లుగా తెలుస్తోంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial