TDP Mala Meeting: తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాలల ఆత్మీయ సమావేశం రాజకీయ విమర్శలకు కేంద్రం అయ్యింది. తెలుగు దేశం హయాంలోనే మాలల సంక్షేమం సాధ్యం అయ్యిందని , ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. మరో వైపున అసలు మాలల పేరు ఎత్తే అర్హత టీడీపీకి లేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.


టీడీపీ ఆధ్వర్యంలో మాలల సమావేశం...
వైసీపీ పాలనలో నాలుగేళ్ళ నుంచి మాలలపై జరుగుతున్న దాడులు,  దౌర్జన్యాలు వారికి జరుగుతున్న అన్యాయంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మాలల ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించిన తర్వాతే బడుగు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం, మర్యాద దక్కిందని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా హక్కుల్ని కల్పించారని, అయితే స్వాతంత్ర్యం వచ్చాక  35 ఏళ్లు దేశంలో రాజ్యాంగం సరిగా అమలు జరగలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రాతిపదికన దళిత వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాన అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 
సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని, టీడీపీ నిజాయితీ నిరూపించుకుంటుందని అన్నారు. గత ఎన్నికల్లో దళితులు గంపగుత్తగా జగన్ కి ఓట్లు వేసి గెలిపించారని,  ఇప్పుడు కూడా  ఆ వర్గాలు తనకే ఓట్లు వేస్తాయన్న భావనలో జగన్ ఉన్నారని, అయితే మరోసారి దళితులు మోసపోవటానికి రెడీగా లేరన్నారు. దళితుల్లో చైతన్యం పెరిగిందని, జగన్ ని ఎప్పుడూ గద్దె దించుదామా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. వైసీపీ తప్పుల్ని ప్రశ్నించినందుకు మహాసేన రాజేష్ ని వేధింపులకు గురిచేశారని,  ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నించకూడదా.. రాష్ట్రం ఏమైనా జగన్ జాగీరా అని ఆయన ప్రశ్నించారు. మాల, మాదిగలు, బలహీన వర్గాలు గౌరవంగా బ్రతకాలంటే చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు.


జగన్ చేసేది అంతా దగా...
జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అని కులాలు దగాపడ్డాయని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.  అందులో మాలలు ఎక్కువగా దగా పడ్డారని తెలిపారు. రాష్ట్రంలో 80 లక్షల మంది దళిత ఓటర్లు ఉన్నారని, దళితుల్లో మాలలు 58 శాతం ఉన్నారని వివరించారు. దళితుల్లో సింగిల్ లార్జెస్ట్ కమ్యునిటీగా మాల సామాజిక వర్గమని పేర్కొన్నారు. 


టీడీపీ కులాల మీటింగ్ పై వైసీపీ కౌంటర్...
దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా..? అని మమ్మల్ని తీవ్రంగా అవమానించిన రోజునే చంద్రబాబు దురాలోచనను ఎస్సీ ఎస్టీ లంతా గమనించారని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. టీడీపీ కులాల వారీగా సమావేశాను నిర్వహించి, ప్రజల్లో విభేదాలను రేకెత్తిస్తోందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో తమకు జరిగిన అన్యాయం పై దళిత వర్గాలు కనీసం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే సాహసం చేయలేని స్థితిలో కి నెట్టేశారని అన్నారు. సుదీర్ఘకాలం చంద్రబాబు అవమానాలు భరించి   2019 ఎన్నికలతో ఆయన్ను దళితులు పూర్తిగా దూరంపెట్టారని అన్నారు. భవిష్యత్తులో బాబు ఊసే దళిత కుటుంబాల్లో వినిపించదని సవాల్ విసిరారు.


దళితలంతా జగన్‌  వెంటే..
రాష్ట్రంలో దళిత కుటుంబాలన్నీ విద్యవైద్యం, ఆదాయపరంగా అభివృద్ధి దిశగా మారుతున్న జీవనశైలితో ఆనందంగా కనిపిస్తున్నాయని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.  ఇలాంటి వాతావరణం నచ్చని చంద్రబాబు, ఆయన్ను భుజాల పై మోసే పచ్చమీడియా కళ్లు పేలిపోతున్నాయేమోనని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశం పై ఉమ్మెస్తే మీ మీదనే పడుతుందనేది చంద్రబాబు, రామోజీరావు తెలుసుకోవాలన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ దళిత కుటుంబాల్లోని వారంతా తన సోదరులు, మేనల్లుళ్లు అంటూ  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రేమగా చూసుకుంటున్నారని అన్నారు. ఆనాటి మహానేత వైఎస్‌ఆర్‌ వెంట నడిచినట్టే, ఈ రోజుకు కూడా దళితజాతి బిడ్డలంతా జగన్‌  వెంట నడుస్తున్నారని అన్నారు. దళిత సోదరుల సైన్యంతో   2024 ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీనే కైవసం చేసుకుంటుందని దీమాగా వ్యక్తం చేశారు.