HDFC Bank-HDFC Merger: దలాల్‌ స్ట్రీట్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా మెర్జర్‌కు మూహూర్తం అధికారికంగా ఖరారైంది. కవల కంపెనీలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ - హెచ్‌డీఎఫ్‌సీ విలీనం జులై 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. HDFC గ్రూప్ చైర్మన్ దీపక్ పారిఖ్ (HDFC chairman Deepak Parekh) ఈ విషయాన్ని ప్రకటించారు. 


జులై 13న, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ HDFC షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి డీలిస్ట్ అవుతాయి. ఆ షేర్లలో ట్రేడింగ్ జులై 12నే ఆగిపోతుంది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లకు అదే చిట్టచివరి ట్రేడింగ్‌ రోజు. 


25 షేర్లకు 42 షేర్లు
జులై 13 నుంచి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ టిక్కెట్‌తోనే హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు ట్రేడ్‌ అవుతాయి. అర్హులైన షేర్‌హోల్డర్లకు, హెచ్‌డీఎఫ్‌సీలో హోల్డ్‌ చేస్తున్న ప్రతి 25 షేర్లకు బదులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన 42 షేర్లను పొందుతారు. ఆ షేర్లు డీమ్యాట్‌ అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతాయి.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ - హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం ఈ నెల 30న జరుగుతుంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు చివరి సమావేశం అదే అవుతుంది. జూన్ 30న మార్కెట్ ముగిసిన తర్వాత రెండు ఆర్థిక సంస్థల బోర్డు మీటింగ్ ఉంటుందని, విలీనానికి రెండు బోర్డ్‌ల నుంచి ఆమోదం లభిస్తుందని దీపక్ పారిఖ్ చెప్పారు. 


HDFC బ్యాంక్, HDFC విలీనం గురించి 2022 ఏప్రిల్‌లో ప్రకటించారు. అప్పటి నుంచి వివిధ దశలను దాటుకుంటూ, ఎట్టకేలకు క్లైమాక్స్‌ను చేరింది.


రెండో అతి పెద్ద కంపెనీ
HDFC బ్యాంక్, HDFC విలీనం తర్వాత ఏర్పడే కొత్త కంపెనీ బాహుబలిలా కనిపిస్తుంది. కొత్త కంపెనీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత దేశంలో రెండో అతి సంస్థగా అవతరిస్తుంది. రూ. 16,83,950 కోట్ల మార్కెట్ క్యాప్‌తో ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది. ఇవాళ్టి (మంగళవారం, 27 జూన్‌ 2023) విలువ ఆధారంగా, HDFC బ్యాంక్, HDFC మార్కెట్ క్యాప్‌ను జోడిస్తే, మెర్జ్‌డ్‌ ఎంటిటీ రూ. 14,45,958 కోట్ల విలువతో రెండో స్థానంలో ఉంటుంది. ఇప్పటి వరకు సెకండ్‌ ప్లేస్‌లో ఉన్న టాటా గ్రూప్‌ ఐటీ కంపెనీ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) మూడో స్థానానికి పడిపోతుంది.


విలీనం తర్వాత, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా, HDFC బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కంటే రెండింతలు పెద్దదిగా మారుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ. 6,52,555 కోట్లు. అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ SBI కన్నా దాదాపు మూడు రెట్లు పెద్దదిగా అవతరిస్తుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ. 5.03 లక్షల కోట్లు.


విలీనానికి సంబంధించి అధికారిక ప్రకటన రావడంతో, ఇవాళ్టి ట్రేడ్‌లో HDFC బ్యాంక్, HDFC షేర్లు అద్భుతంగా ర్యాలీ చేశాయి. HDFC బ్యాంక్ స్టాక్ 1.45% లాభంతో రూ. 1,659.10 వద్ద ముగిసింది. HDFC షేర్లు కూడా 1.49% లాభంతో రూ. 2,760 వద్ద ఆగాయి.


హెచ్‌డీఎఫ్‌సీ డీలిస్టింగ్‌ తర్వాత, దాని ప్లేస్‌లో ఎల్‌టీఐమైండ్‌ట్రీ (LTIMindtree) నిఫ్టీ50లోకి అడుగు పెట్టే ఛాన్స్‌ ఉంది. దీంతో, ఎల్‌టీఐమైండ్‌ట్రీలోకి అదనంగా 150-160 మిలియన్‌ డాలర్ల పాసివ్‌ ఫండ్స్‌ వచ్చి పడే అవకాశం ఉంది.


మరో ఆసక్తికర కథనం: ఆర్‌బీఐ ఈ-రూపీ యాప్‌ వచ్చేసిందోచ్‌ - ఎలా డౌన్‌లోడ్‌ చేయాలి, పేమెంట్‌ ప్రాసెస్‌ ఏంటీ? 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial