తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర నాయకత్వం వ్యూహాలను రచిస్తోంది. పోరాటాలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి భిన్నంగా ఉంటోంది కేడర్. నేతల తీరుతో శ్రేణులు అయోమయంలో పడుతున్నారు. 


కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండాలో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ రచ్చరచ్చగా మారింది. ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేతలు సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు వర్గీయులు తన్నుకున్నారు. ఇటీవల మదన్ మోహన్ రావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని సస్పెండ్ చేస్తున్నట్టు కామారెడ్డి డిసీసీ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్ ప్రకటించారు. ఇది అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. పీసీసీ కూడా క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమయించింది. కానీ ఇంత వరకు నిర్ణయమైతే మాత్రం తీసుకోలేదు. ఇంతలోనే మరోసారి విభేదాలతో ఈ రెండు వర్గాలు రోడ్డెక్కాయి. 


రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి తండాలో రచ్చ బండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ సుభాష్ రెడ్డి వర్గీయులు అక్కడి వచ్చారు. సస్పెన్షన్‌లో ఉన్న వ్యక్తి పార్టీ కార్యక్రమాలు పెట్టడమేంటని ప్రశ్నించారు. మదన్ మోహన్ సస్పెన్షన్ ఎత్తివేయలేదని సుభాష్ రెడ్డి అన్నారు. ఒకవేళ పార్టీ మీ సస్పెన్షన్ ఎత్తివేస్తే తమ కార్యకర్తలు కలిసి కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. మదన్ మోహన్ గురించి పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా ఉన్న విషయాన్ని సుభాష్ రెడ్డి గుర్తు చేశారు. 


సుభాష్‌రెడ్డి సస్పెన్షన్‌ విషయాన్ని అక్కడ ప్రస్తావించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ వర్గీయుల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఘర్షణలో గాయపడ్డ వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


మొన్నటికి మొన్న ఎల్లారెడ్డిలో జరిగిన సభలో ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎదుటే సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావుల మధ్య వర్గ పోరు బహిరంగమైంది. ఒకరి వర్గం మరో వర్గం ఫ్లెక్సీలు చింపుకున్నారు. మదన్ మోహన్ రావు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ ఎంపీగా పోటీ చేశారు. స్వల్ప మెజార్టీతో మదన్ మోహన్ రావు ఓటమి చెందారు. అయితే అప్పటి నుంచి మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నియోజక వర్గంపై కన్నేశారు. గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జాజుల సురేందర్ పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన టీఆరెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంపై సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు కన్నేశారు. ఇద్దరు ఎవరికి వారే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఇరువర్గాలకు మింగుడు పడటం లేదు. మదన్ మోహన్ రావు పార్టీ నాయకులకు సమాచారం లేకుండా సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారన్న నెపంతో కామారెడ్డి జిల్లాలోని ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇంఛార్జీలు, పార్టీ సీనియర్ నాయకులు షబ్భిర్ అలీ సైతం మదన్ మోహన్ రావు తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. 


ఇప్పటికే కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్ పార్టీ నుంచి మదన్ మోహన్ రావును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఇష్యూపై ఇప్పటికే పీసీసీలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై పీసీసీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అయితే ఎల్లారెడ్డి పల్లి తాండలో జరిగిన రచ్చ బండలో మరోసారి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.