Ola CEO Bhavish Aggarwal booked after employee dies by suicide: ఓలా ఎలక్ట్రిక్ సంస్థలో పనిచేస్తున్న 38 ఏళ్ల ఇంజినీర్ కె. అరవింద్ సెప్టెంబర్ 28న బెంగళూరు చిక్కలసంద్రలోని తన అపార్ట్‌మెంట్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాజా అగ్రసేన్ హాస్పిటల్‌కు తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు. అతని గదిలో 28 పేజీల హ్యాండ్‌రిటన్ సూసైడ్ నోట్ లభ్యమైంది. ఈ నోట్‌లో ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, హోమోలగేషన్ ఇంజినీరింగ్ హెడ్ సుబ్రత్ కుమార్ దాస్ మరియు ఇతర అధికారులపై మానసిక వేధింపులు, జీతాలు, అలవెన్సుల చెల్లింపుల్లో జాప్యం వంటి తీవ్ర ఆరోపణలు చేశాడు.
అరవింద్ 2022 నుంచి ఓలా ఎలక్ట్రిక్ కోరమంగళ బ్రాంచ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతని సోదరుడు అశ్విన్ కన్నన్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 6న సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపణ) , 3(5) (సాధారణ ఉద్దేశ్యం) కింద కేసు నమోదు చేశారు.
28 పేజీల సూసైడ్ నోట్‌లో అరవింద్ తన సీనియర్లు మానసిక వేధింపులకు గురిచేశారని, జీతాలు, అలవెన్సులు సరిగా చెల్లించలేదని పేర్కొన్నాడు. ఇది తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని, ఆత్మహత్యకు పురికొల్పిందని ఆరోపించాడు. మరణం తర్వాత సెప్టెంబర్ 30న అతని బ్యాంక్ అకౌంట్‌కు రూ.17.46 లక్షలు నెఫ్ట్ ద్వారా బదిలీ అయినట్లు కుటుంబం సందేహాలు వ్యక్తం చేసింది. ఇది అనుమానాస్పదమని, కంపెనీ అంతర్గత లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అరవింద్ సోదరుడు అశ్విన్ కన్నన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. కంపెనీ అధికారులు స్పష్టమైన వివరణలు ఇవ్వకుండా, లోపాలను కప్పిపుచ్చుతున్నారని కుటుంబం ఆరోపించింది. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ప్రకారం విషం తాగడం వల్ల మరణం సంభవించినట్లు ధృవీకరణ అయింది.
ఓలా ఎలక్ట్రిక్ అధికారిక ప్రకటనలో అరవింద్ మరణానికి విచారం వ్యక్తం చేసింది. అతను 3 ఏళ్ల 5 నెలలుగా కంపెనీలో పనిచేస్తున్నాడని, ఎప్పుడూ హరాస్‌మెంట్ లేదా ఉద్యోగ సమస్యలపై ఫిర్యాదు చేయలేదని చెప్పింది. అతని రోల్ టాప్ మేనేజ్‌మెంట్‌తో డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదని పేర్కొంది. మరణం తర్వాత కుటుంబానికి సహాయంగా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్‌ను అకౌంట్‌కు బదిలీ చేశామని తెలిపింది. కంపెనీ సురక్షిత, గౌరవప్రదమైన వర్క్‌ప్లేస్‌ను నిర్వహిస్తుందని చెప్పింది.ఓలా ఎలక్ట్రిక్ ఎఫ్ఐఆర్‌ను సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ మహమ్మద్ నవాజ్ ఆదేశాలతో పోలీసులు భవిష్ అగర్వాల్, ఓలా ఎలక్ట్రిక్, సుబ్రత్ కుమార్ దాస్‌లను విచారణ పేరుతో వేధించవద్దని ఆదేశించారు. కంపెనీ, అధికారులకు అనుకూలంగా ప్రొటెక్టివ్ ఆర్డర్లు జారీ అయ్యాయి.