Coromandel Express Train Crash:
ఇలా జరిగింది..
ఒడిశా రైల్వే ప్రమాదంపై ఉన్నతాధికారులు తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యాక్సిడెంట్‌కి సంబంధించిన కొన్ని కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటికే రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ "ఎలక్ట్రానిక్ ఇంటర్‌లింకింగ్ సిస్టమ్"లో లోపం వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలిపారు. రైల్వే బోర్డ్ అధికారులు దీనిపై మరికొన్ని వివరాలు అందించారు. ప్రమాదానికి కారణాలేంటో చెప్పారు. వాళ్లు చెప్పిన వివరాల ఆధారంగా చూస్తే...ప్రమాదం జరిగిన బాలాసోర్‌లోని బహనగబజార్ వద్ద నాలుగు ట్రాక్‌లున్నాయి. ఇందులో మధ్యలో ఉన్న రెండు మెయిన్ లైన్స్. వీటికి రెండు వైపులా లూప్ లైన్స్ ఉన్నాయి. ఈ రెండు లూప్ లైన్స్‌లోనూ రెండు గూడ్స్ ట్రైన్‌లు ఐరన్ ఓర్ లోడ్‌తో ఉన్నాయి. అదే సమయానికి షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ చెన్నై నుంచి హౌరా వైపు వస్తోంది. అటు బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎదురుగా హౌరా నుంచి వస్తోంది. మధ్యలో ఉన్న రెండు మెయిన్ లైన్స్‌కీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 126కిలోమీటర్ల వేగంతో వస్తోంది. ఈ రెండు ఎక్స్‌ప్రెస్‌ల స్పీడ్ లిమిట్ 130 కిలోమీటర్లు. అంటే...రెండూ కూడా ఓవర్‌స్పీడ్‌లో ఏమీ రావడం లేదు. సిగ్నలింగ్‌లో పొరపాటు వల్ల కోరమాండల్ లూప్‌లైన్‌లోకి వెళ్లి గూడ్స్‌ని ఢీకొట్టినట్టు రైల్వే బోర్డ్ అధికారులు వివరించారు. అయితే...ఇది కచ్చితంగా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్లే జరిగిందని చెప్పడానికి లేదని వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ జరిపి ఈ వివరాలు ఇస్తున్నట్టు చెప్పారు. పూర్తిస్థాయిలో విచారణ జరిగాకే కచ్చితమైన కారణాన్ని చెప్పగలమని తెలిపారు.
"సిగ్నలింగ్ సమస్య తలెత్తింది. అలా అని పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పలేం. ఇది కేవలం ప్రాథమికంగా మేం కనుగొన్న కారణం మాత్రమే. కేవలం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కారణంగానే ఈ భారీ ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి లూప్‌లైన్‌లోకి వెళ్లి గూడ్స్‌ని ఢీకొట్టింది. ఆ ధాటికి కొన్ని కోచ్‌లు అదుపు తప్పి పక్క ట్రాక్‌లపై చెల్లాచెదురుగా పడ్డాయి. హౌరా నుంచి వస్తున్న ఎక్స్‌ప్రెస్‌కి ఈ కోచ్‌లు ఢీకొట్టాయి. ఫలితంగా ఆ ట్రైన్ కూడా అదుపు తప్పి పడిపోయింది"
- రైల్వే బోర్డ్ అధికారులు
కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్న వాదనని రైల్వే బోర్డ్ అధికారులు కొట్టిపారేశారు. ఒకవేల ఆ సిస్టమ్ ఉన్నా ప్రమాదం జరిగి ఉండేదని వెల్లడించారు.
"కవచ్ సిస్టమ్ ఉన్నా ఈ ప్రమాదం జరిగి ఉండేదేమో. అసలు అది కారణమే కాదు. ప్రపంచంలో ఏ టెక్నాలజీ కూడా అడ్డుకోలేని ఘోర ప్రమాదమది. మీరు రోడ్డుపై వెళ్తుంటే ఉన్నట్టుండి బండరాళ్లు వాహనాల పైకి వచ్చి పడితే ఏం చేస్తారు? ఈ ప్రమాదమూ అలాంటిదే"
- రైల్వే బోర్డ్ అధికారులు