Coromandel Train Accident: 


సిగ్నలింగ్‌ సిస్టమ్ ఫెయిల్ అయిందా? 


ఒడిశా రైల్వే ప్రమాదానికి కారణమేంటో పూర్తిస్థాయిలో విచారణకు కేంద్ర రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికిప్పుడు కారణాలు చెప్పలేమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం సిగ్నలింగ్ వ్యవస్థలో (Railway Signalling System) లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తోంది. అంతే కాదు. ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ ప్రమాదాలు నిలువరించేందుకు కొత్త వ్యవస్థ తీసుకొచ్చింది. అదే "కవచ్ సిస్టమ్" (Kavach System). ఇది పని చేయకపోవడం వల్లే ఈ స్థాయిలో ప్రాణనష్టం నమోదైందన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. దీనిపై ఇప్పటికే రైల్వే అధికారులు క్లారిటీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన రూట్‌లో కవచ్ సిస్టమ్‌ లేదని వెల్లడించారు. ఈ వ్యవస్థ అందుబాటులో ఉండి ఉంటే...సమాచార లోపం తలెత్తేది కాదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. 


ఏంటీ కవచ్ సిస్టమ్..? 


గతేడాది మార్చిలో కేంద్ర రైల్వే శాఖ రైలు ప్రమాదాలు నిలువరించేందుకు కవచ్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టింది. ఇదో ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థ.  Research Design, Standards Organisation సంయుక్తంగా ఈ సిస్టమ్‌ని డిజైన్ చేశాయి. మూడు ఇండియన్ సంస్థలతో కలిసి తయారు చేశాయి. ఇది కేవలం లోకోమోటివ్ డ్రైవర్‌లను ప్రాణాపాయం నుంచి తప్పించడమే కాకుండా...స్పీడ్‌ కంట్రోలింగ్‌లో, డేంజర్ సిగ్నల్స్‌ని గమనించడంలోనూ తోడ్పడుతుంది. వాతావరణం సరిగ్గా లేని సమయాల్లోనూ విజిబిలిటీలో ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటుంది. గతేడాది కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా ఈ కవచ్ సిస్టమ్‌ని పరీక్షించారు. ఎదురుగా ఏదైనా ట్రైన్ వచ్చినప్పుడు ఆటోమెటిక్‌గా సిగ్నల్ ఇచ్చి రైలు ఆగిపోయేలా ఈ సిస్టమ్‌ని తయారు చేశారు. ఈ ప్రయోగం సక్సెస్ అయిందని వెల్లడించారు అశ్వినీ వైష్ణవ్. ఓ వీడియో కూడా అప్పట్లో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. "కవచ్ సిస్టమ్‌ టెస్టింగ్ విజయవంతమైంది. ఎదురుగా వచ్చే ట్రైన్‌ని గుర్తించి 380 మీటర్ల దూరంలోనే నేను ప్రయాణిస్తున్న ట్రైన్ ఆగిపోయింది"  అని వెల్లడించారు. డ్రైవర్‌లు బ్రేక్ వేయడంలో నిర్లక్ష్యం వహించినా, పొరపాటున వేయకపోయినా వెంటనే ఈ కవచ్ సిస్టమ్‌ అలెర్ట్ అవుతుంది. ట్రైన్‌ని ప్రమాదం నుంచి బయట పడేస్తుంది. అయితే...ప్రస్తుతం ప్రమాదం జరిగిన రూట్‌లో ఈ కవచ్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడం వల్ల భారీ ప్రాణనష్టం వాటిల్లింది.