రాజా రవీంద్ర (Raja Ravindra) ప్రధాన పాత్రలో రూపొందుతోన్న 'డియర్ జిందగీ' (Dear Zindagi Telugu Movie) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా  పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) ను దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్షవర్ధన్ ఇతర తారాగణం. రాజా రవీంద్ర సమర్పణలో సాయిజా క్రియేషన్స్, మహా సినిమా పతాకంపై ఉమా దేవి, శరత్ చంద్ర చల్లపల్లి నిర్మిస్తున్నారు. 


'డియర్ జిందగీ' సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. కళ్యాణ్ కృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయడంతో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. 


'డియర్ జిందగీ' సినిమా కథ ఏమిటంటే?
ప్రశాంతమైన కాలనీలో హ్యాపీగా ఉండాలని వచ్చిన ఓ కుటుంబానికి... వారి పిల్లల వల్ల ఇబ్బందులు ఎదురు అవుతాయి. జనాల నుంచి ఛీత్కారాలు ఎదురవుతాయి. ఆ తండ్రి పిల్లలకి తోడుగా ఉండటంతో పాటు సమాజం తన కుటుంబాన్ని చూసి గర్వపడేలా ఎలా చేశాడు? అనేది సినిమా కథ. ఇదొక క్రేజీ ఫ్యామిలీ డ్రామా అని చిత్ర బృందం పేర్కొంది. 


ముగ్గురు పిల్లలకు తండ్రిగా రాజా రవీంద్ర
'డియర్ జిందగీ' సినిమాలో ముగ్గురు పిల్లలకు తండ్రి పాత్రలో తాను నటిస్తున్నట్లు చిత్ర సమర్పకులు, నటుడు రాజా రవీంద్ర తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''కొత్త కథాంశంతో ప్రస్తుతం సమాజంలో జరిగే సమస్యలు ప్రస్తావిస్తూ తీస్తున్న చిత్రమిది. పిల్లలు చేసే పనులకు ఫ్రస్ట్రేషన్ వచ్చే క్యారెక్టర్. చాలా రోజుల తర్వాత ఫుల్ లెన్త్ రోల్ చేస్తున్నా. మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది'' అని చెప్పారు. 


Also Read : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ


''సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన వినాయక్ గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి థాంక్స్. మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ తీయాలని స్నేహితులతో కలిసి నిర్మాణ సంస్థ స్థాపించాం. 'దండుపాళ్యం' దర్శకులు శ్రీనివాస్ రాజు దగ్గర పని చేసిన పండు చెప్పిన కథ నాకు, మా స్నేహితులకు నచ్చడంతో ఈ సినిమా ప్రారంభించాం. మాకు రాజా రవీంద్ర గారు కూడా మద్దతుగా నిలవడంతో పాటు ఇందులో ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఆయనకు థాంక్స్'' అని నిర్మాత శరత్ చంద్ర చల్లపల్లి చెప్పారు. ఎంఎం కీరవాణి గారి దగ్గర కీ బోర్డ్ ప్లేయర్ గా పని చేసిన యం. ఎబెనెజర్ పాల్  ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారని సహ నిర్మాత క్రాంతి ముండ్ర తెలిపారు.


Also Read బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్



 
కథ రాయడానికి ఏడాది పట్టింది!
దర్శకుడు పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) మాట్లాడుతూ ''ఈ కథ రాయడానికి ఏడాది పట్టింది. పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత నిర్మాత శరత్ గారికి చెప్పాను. రాజా రవీంద్ర గారు నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. ఆయన ఫుల్ సపోర్ట్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి కథ రాలేదు. మిడిల్ క్లాస్ కుటుంబాలకు కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది'' అని చెప్పారు. 'కాంతారా' తర్వాత తాను అన్ని పాటలు రాస్తున్న చిత్రమిదని లిరిక్ రైటర్ గోసాల రాంబాబు తెలిపారు. మొయిన్, యశస్విని, మోహిత్, ఎల్. వి ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : వినయ్ కొట్టి, కూర్పు : రాజ్ మేడ, ఛాయాగ్రహణం : సిద్ధార్థ స్వయంభు, సంగీతం : ఎమ్. ఎబెనెజర్ పాల్.