Odisha Train Accident:  


డ్రోన్‌ వీడియో..


ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 900 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం 261 మంది చనిపోయారు. కోల్‌కత్తా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాసోర్‌లో ఈ ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్‌ ట్రైన్‌ని ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ట్రైన్ యాక్సిడెంట్‌ అయిన దాఖలాల్లేవు. మూడు ట్రైన్‌లు చెల్లాచెదురయ్యాయి. ప్రమాద స్థలం పరిసర ప్రాంత ప్రజలు కూడా అక్కడికి రావడానికి వణికిపోతున్నారు. అంత దారుణంగా ఉన్నాయి అక్కడి దృశ్యాలు. ఎక్కడ పడితే అక్కడ శరీర భాగాలు కనిపిస్తున్నాయి. వాళ్లందరినీ గుర్తించి క్రమంగా ఆంబులెన్స్‌లలో తరలిస్తున్నాయి రెస్క్యూ టీమ్‌లు. ఆసుపత్రులకు తరలించేందుకు ఆంబులెన్స్‌లు చాలడం లేదు. ఈ క్రమంలోనే ANI న్యూస్ ఏజెన్సీ అక్కడి దృశ్యాలను డ్రోన్‌తో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అక్కడి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో కళ్లకు కడుతోంది ఈ వీడియో. ఈ వీడియో షూట్ చేసి సమయానికి మృతుల సంఖ్య 238గా నమోదైంది. ప్రస్తుతం ఇది ఇంకా పెరుగుతూనే ఉంది. 300 మందికి పైగానే చనిపోయి ఉంటారని అంచనా. అధికారికంగా లెక్కలు వస్తే తప్ప మొత్తం మృతుల సంఖ్య తేలేలా లేదు. మూడు రైళ్లు ఎలా చెల్లాచెదురయ్యాయో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.





రెస్క్యూ టీమ్‌ విశ్రాంతి లేకుండా పని చేస్తోంది. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడి సురక్షితంగా బయటపడిన కొందరు ప్రయాణికులు ఆ సమయంలో ఏం జరిగిందో వివరిస్తున్నారు. 


"ప్రమాద సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 110-115 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. అప్పటి వరకూ స్మూత్‌గానే వెళ్లింది. కానీ ఉన్నట్టుండి ప్రమాదానికి గురైంది. కేవలం 30-40 సెకన్లలోనే చాలా మంది గాయపడ్డారు. కొందరు అక్కడికక్కడే మృతి చెందారు. చాలా మంది తమ వాళ్లను పోగొట్టుకుని గట్టిగా ఏడుస్తూ కూర్చున్నారు"


- ప్రయాణికుడు, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్