Bharat Jodo Yatra: 


భారత్ జోడో యాత్రపై జైరాం రమేశ్ స్పందన..


కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం నింపేందుకు రాహుల్ గాంధీ...భారత్ జోడో యాత్ర చేపట్టి సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. ఇటీవలే కేరళలో యాత్ర పూర్తికాగా..ఇప్పుడది కర్ణాటకకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కాంగ్రెస్‌లో మార్పునకు ఇదే ఉదాహరణ. నిజమైన రాహుల్ గాంధీ ఇప్పుడే అందరికీ తెలుస్తున్నారు. కొత్త రాహుల్ గాంధీ అని అనడం లేదు. కానీ... నిజమైన రాహుల్ గాంధీ ప్రజలకు పరిచయం అవుతున్నారు" అని అన్నారు. ప్రజలతో, పార్టీ కార్యకర్తలతో ఆయన మమేకమవుతున్న తీరు, ఆయన ఫిట్‌నెస్‌ "రియల్ రాహుల్ గాంధీ"కి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. భారత్ జోడో యాత్ర ప్రారంభించి నెల రోజులు పూర్తైన సందర్భంగా...జైరాం రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్విటర్‌లోనూ పోస్ట్ చేశారు. "భారత్ జోడో యాత్ర ఇలా సాగుతుందని మేము ఊహించలేదు. కానీ నా సీనియర్ దిగ్విజయ్ సింగ్‌తో పాటు సేవా దళ్‌తో కలిసి నడవటం చాలా స్ఫూర్తినిస్తోంది. వాళ్ల అంకిత భావానికి, కమిట్‌మెంట్‌కి సెల్యూట్ చేస్తున్నాను" అని పోస్ట్ చేశారు. "మేం మానసికంగా ఇప్పటికే విజయం సాధించాం. కాంగ్రెస్ కూడా గట్టిగా నిలబడగలదని ఈ భారత్ జోడో యాత్రతో అందరికీ తెలిసొస్తోంది. మేం వీధుల్లోకి వస్తున్నాం. నేరుగా భాజపాతోనే యుద్ధం చేస్తున్నాం. ప్రజా సమస్యలను చర్చిస్తున్నాం. మేము దేనికీ అతిగా రియాక్ట్ అవడం లేదు. ఆ పని భాజపానే చేస్తోంది. భాజపా మా యాత్రకు స్పందిస్తూ...మాకు మంచే చేస్తోంది. ఎన్నికల విషయం పక్కన పెడితే...మానసికంగా వాళ్లతో యుద్ధం మొదలైంది" అని జైరాం రమేష్ స్పష్టం చేశారు. 






రాహుల్‌తో సోనియా..


దసరా కారణంగా మధ్యలో రెండు, మూడు రోజులు విరామమిచ్చి మళ్లీ యాత్ర మొదలు పెట్టారు. కర్ణాటక రాష్ట్రంలో రాహుల్‌తో పాటు సోనియా గాంధీ కూడా పర్యటిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో పాటు భాజపా ఇక్కడ అధికారంలో ఉండటం వల్ల కాంగ్రెస్ ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. చాలా రోజుల తరవాత ఆమె ఓ బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా...పార్టీ కార్యక్రమాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు సోనియా. కర్ణాటకలో మాండ్య నుంచి పాదయాత్ర మొదలు కాగా...రాహుల్‌, సోనియా ఇందులో పాల్గొని పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. బళ్లారిలో ఓ భారీ ర్యాలీ చేపడతారని, అందులోనూ సోనియా పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌ జోడో యాత్రలో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు రాహుల్ గాంధీ. పార్టీలో ఉత్తేజం నింపేందుకు ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలే కేరళలో యాత్రను ముగించుకున్న రాహుల్...ఇప్పుడు కర్ణాటకలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో కాన్నా కాస్త అగ్రెసివ్‌గానే మాట్లాడుతున్నారు.


Also Read: Bharat Jodo Yatra: కింద పడిపోయిన పాప- ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న సోనియా, రాహుల్!