North Korea Tourism: కిమ్‌ ఇలాఖాకి వెళ్లాలనుకుంటే ఇక బ్యాగ్‌లు సర్దేసుకోవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి నార్త్ కొరియాలో టూరిజం మళ్లీ ప్రారంభిస్తారట. అక్కడి పర్యాటక సంస్థలు ఈ ప్రకటన చేశాయి. అంతర్జాతీయ పర్యాటకాన్ని పున:ప్రారంభిస్తున్నట్టు వెల్లడించాయి. దాదాపు నాలుగేళ్ల విరామం తరవాత ఈ నిర్ణయం తీసుకుంది కిమ్ ప్రభుత్వం. పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే సమ్‌జియోన్‌లో పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. కొవిడ్ కారణంగా దాదాపు నాలుగేళ్లుగా అంతర్జాతీయ సరిహద్దుల్ని మూసేసింది నార్త్ కొరియా. ఇకపై ఈ ఆంక్షలు ఎత్తేయాలని నిర్ణయించింది. నిజానికి గతేడాది ఫిబ్రవరిలోనే రష్యాకి చెందిన కొందరు టూరిస్ట్‌లు నార్త్ కొరియాలో పర్యటించారు. కాకపోతే అది ప్రైవేట్ టూర్. అయితే..అప్పటి నుంచే అంతర్జాతీయ విమాన సేవలూ మొదలయ్యాయి. 



ఈ ఏడాది జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా నార్త్ కొరియాలో పర్యటించారు. నాలుగేళ్లుగా అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించడం వల్ల లోకల్ టూరిజం కొంత వరకూ నష్టాన్ని చవి చూసింది. అందుకే ఇప్పుడు మళ్లీ ప్రారంభం అవుతోందంటే టూరిజంపైనే ఆధారపడి ఉన్న వాళ్లంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చైనా సరిహద్దుకి దగ్గర్లో ఉన్న సమ్‌జియోన్‌లో ప్రత్యేకంగా ఓ సిటీ నిర్మిస్తోంది నార్త్ కొరియా. కొత్త హోటళ్లు, అపార్ట్‌మెంట్‌లతో పాటు స్కై రిసార్ట్‌నీ ఏర్పాటు చేస్తోంది. ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆలస్యమైంది. కిమ్ జాంగ్ ఉన్ ఆ అధికారులపై వెంటనే చర్యలు తీసుకున్నారు కిమ్. ఉద్యోగం నుంచి తప్పించారు. 


Also Read: Gaza: బర్త్ సర్టిఫికేట్స్ తెచ్చేలోగా బాంబు దాడులు, మృత్యు ఒడిలోకి పసికందులు - తండ్రికి గుండెకోత