North Korea Missile Test: ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా గురువారం రెండు బాలిస్టిక్ క్షిపణులను ఆ దేశం పరీక్షించింది.
ఆరోసారి
గత 10 రోజుల్లో ఆరోసారి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ఉత్తర కొరియా. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తున్నాయని దానికి కౌంటర్‌గా క్షిపణి పరీక్షలు చేస్తున్నట్లు ఉత్తర కొరియా తెలిపింది.
అమెరికా సీరియస్
అయితే వరుసగా ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు చేయడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. యూఎన్ భద్రతా మండలి అత్యవసర సమావేశానికి అమెరికా పిలుపునిచ్చింది. రష్యా, చైనా దేశాలు ఉత్తర కొరియాకు అండగా నిలుస్తున్నాయని అమెరికా పరోక్ష వ్యాఖ్యలు చేసింది.
జపాన్ మీదుగా
ఉత్తర కొరియా.. తూర్పు వైపున జపాన్ గగనతలం మీదుగా గుర్తు తెలియని బాలిస్టిక్ క్షిపణిని ఇటీవల పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ ఒక ప్రకటనలో తెలిపారు. జపాన్ కోస్ట్‌గార్డ్ కూడా ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు ధ్రువీకరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ హెచ్చరించింది. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ప్రజలకు సూచించింది.
ఆగ్రహం
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంపై జపాన్ ప్రధాని కిషిదా ఆగ్రహం వ్యక్తం చేశారు. అణ్వాయుధాలు కలిగిన దేశాలను రెచ్చగొట్టాలని ఉత్తర కొరియా ప్రయత్నిస్తోందని కిషిదా అన్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
ఇటీవల ఉత్తర కొరియా స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని సముద్రం వైపు ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. టైకాన్ అనే ప్రదేశం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో పడిందని పేర్కొంది. ఈ ప్రయోగంపై దక్షిణ కొరియా సైన్యం తీవ్ర అభ్యంతరం తెలిపింది.
కొత్త చట్టం
ప్రపంచంపై రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉన్న వేళ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల కొత్త బాంబు పేల్చారు. అణ్వాయుధాల వినియోగంపై ఓ కొత్త చట్టం తీసుకువచ్చారు. తనను తాను రక్షించుకునే సమయంలో ముందస్తుగా అణ్వాయుధ దాడి చేసే రీతిలో ఉత్తర కొరియా ప్రభుత్వం ఈ చట్టాన్ని తయారు చేసింది. అణ్వాయుధీకరణ అంశంలో వెనక్కి తగ్గేది లేదని కిమ్ జోంగ్ ఉన్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.
" అణ్వాయుధాల వినియోగంపై వెనక్కి తగ్గేదే లేదు. మా దేశాన్ని రక్షించుకునే విషయంలో అవసరమైతే ముందుగా మేమే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం. "
దేశానికి న్యూక్లియర్ స్టేటస్ ఇస్తూ నార్త్ కొరియా పార్లమెంట్ ఈ కొత్త చట్టాన్ని రూపొందించింది. అటామిక్ ఆయుధాలను ఆటోమెటిక్‌గా వాడుకునే అవకాశాన్ని మిలిటరీకి కల్పిస్తున్నట్లు కొత్త చట్టంలో పేర్కొన్నారు.
Also Read: Amit Shah in Baramulla Rally: మసీదు నుంచి 'ఆజాన్' పిలుపు- అమిత్ షా ఏం చేశారంటే?