India Myanmar Border Issue: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. మయన్మార్, భారత్ మధ్య ఉన్న Free Movement Regime ని సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం...భారత్ నుంచి మయన్మార్‌కి కానీ...మయన్మార్‌ నుంచి భారత్‌ కానీ 16 కిలోమీటర్ల వరకూ ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండానే వచ్చేందుకు అనుమతి ఉంది. వీసా లేకుండానే ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. ఇప్పుడా అనుమతిని తొలగించింది కేంద్ర ప్రభుత్వం. సరిహద్దుల్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అమిత్‌ షా స్పష్టం చేశారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకున్నట్టు తెలిపారు. X వేదికగా ఈ విషయం వెల్లడించారు. 


"మన దేశ సరిహద్దుల్ని కాపాడుకోవాలన్న ప్రధాని మోదీ లక్ష్యం మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ మయన్మార్ మధ్య ఉన్న Free Movement Regimeని సస్పెండ్ చేస్తున్నాం. దేశ అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అనుమతి రద్దుపై ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది. హోంశాఖ తక్షణమే ఈ ఆంక్షల్ని అమలు చేయాలని వెల్లడించింది"


- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి 


 






ఇప్పటికే అమిత్ షా ఓ ప్రకటన చేశారు. భారత్‌, మయన్మార్‌ల సరిహద్దులోని 1,643 కిలోమీటర్ల పొడవునా కంచె నిర్మించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. సరిహద్దు వెంబడి గస్తీ మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.


"భారత్ మయన్మార్ మధ్య సరిహద్దు వెంబడి పూర్తిగా కంచెను నిర్మిస్తాం. మణిపుర్‌లోని మోరేలో ఇప్పటికే 10 కిలోమీటర్ల కంచె నిర్మించాం. హైబ్రిడ్‌ నిఘా వ్యవస్థ ద్వారా మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో కిలోమీటరు చొప్పున ఫెన్సింగ్‌ ఏర్పాటుకు పైలట్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి"


- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి