No Confidence Motion Debate :  ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశంతో కాదని.. మణిపూర్‌కు న్యాయం చేసేందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్ ప్రకటించారు.  కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మంగళవారం లోక్ సభలో ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభిచారు.  ఇది సంఖ్యా బలానికి సంబంధించినది కాదని, కేవలం మణిపూర్ రాష్ట్రానికి న్యాయం జరగడం కోసమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించాలని కోరుతూ తాను ఈ తీర్మానాన్ని ప్రతిపాదించానని తెలిపారు. ఇండియా కూటమి ఈ తీర్మానాన్ని మణిపూర్ రాష్ట్రం కోసం తీసుకొచ్చిందని, మణిపూర్ న్యాయం కోరుతోందని తెలిపారు.


మణిపూర్ తగలబడుతూంటే మోదీ మౌనం  : కాంగ్రెస్ ఎంపీ గొగోయ్    


మణిపూర్ తగులబడుతోందంటే భారత దేశం తగులబడినట్లేనన్నారు. వివిధ వర్గాల మధ్య ఇంత తీవ్రమైన విద్వేషాన్ని మునుపెన్నడూ చూడలేదన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్‌ను ఆ పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ రాజకీయాలు మణిపూర్‌లో రెండు మణిపూర్‌లను సృష్టించాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల జాఢ్యం పెరిగిందని ఆరోపించారు. గంజాయి సాగు పెరుగుతోందన్నారు.


పార్లమెంట్‌లో మోదీ ఎందుకు మాట్లాడరు :  గొగోయ్    


పార్లమెంటులో మాట్లాడరాదనే మౌనవ్రతాన్ని ప్రధాని మోదీ చేపట్టారని, ఆ వ్రతాన్ని భగ్నం చేయాలనే తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పారు. ఇప్పటి వరకు మణిపూర్‌లో ఎందుకు పర్యటించలేదు? దాదాపు 80 రోజుల తర్వాత మాట్లాడినపుడు కేవలం 30 సెకండ్లు మాత్రమే ఎందుకు మాట్లాడారు? మణిపూర్ ముఖ్యమంత్రిని ఆ పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదు? అనే మూడు ప్రశ్నలు మోదీని అడుగుతున్నామని చెప్పారు. అస్సాంలో జాతీయ పౌరుల జాబితా  ని అమలు చేయవలసి ఉందని, ఈశాన్య రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడం లేదని విమర్శించారు.   మణిపూర్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. వైఫల్యాలను బీజేపీ అంగీకరించవలసిన సమయం ఆసన్నమైందన్నారు.  


అవిశ్వాస తీర్మానంపై చర్చకు  మయం కేటాయింపు


లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు 2 రోజుల్లో మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. బీజేపీకి 6 గంటల 41 నిమిషాలు, కాంగ్రెస్‌కి 1 గంట 9 నిమిషాలు, డీఎంకేకి 30 నిమిషాలు, తృణమూల్ కాంగ్రెస్‌కు 30 నిమిషాలు, వైఎస్సార్సీపీకి 29 నిమిషాలు, శివసేనకు 24 నిమిషాలు, జేడీయూకి 21 నిమిషాలు, బీజేడీకి 16 నిమిషాలు, బీఎస్పీకి 12 నిమిషాలు, బీఆర్ఎస్‌కి 12 నిమిషాలు, ఎల్‌జేఎస్పీకి 8 నిమిషాలు చొప్పున సమయాన్ని కేటాయించారు. మిగిలిన ఎన్‌డీఏ అనుకూల పార్టీలు, స్వతంత్ర ఎంపీలకు 17 నిమిషాలు కేటాయించారు. తటస్థ పార్టీలకు   52 నిమిషాల సమయం ఇచ్చారు. బీజేపీ తరపున 15 మంది  మాట్లాడతారు.