Akhilesh Yadav on Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ I.N.D.I.A కూటమిని వీడిపోతున్నారన్న వార్తల నేపథ్యంలోనే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ప్రతిపక్ష కూటమి తరపున ఆయన బలంగా నిలబడి ఉంటే కచ్చితంగా ప్రధాని అయ్యే వారని జోష్యం చెప్పారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు అఖిలేశ్. ప్రతిపక్ష కూటమిలోని కీలక నేతలందరికీ ప్రధాని అభ్యర్థిగా నిలబడే అర్హత ఉందని, కానీ ఆ పదవికి సరైన వ్యక్తి నితీశ్ కుమార్ మాత్రమేనని అన్నారు. ఈ కూటమి ఏర్పాటు చేయడంలో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన ఇలా యూటర్న్ తీసుకుంటారని అనుకోలేదని విచారం వ్యక్తం చేశారు.
"మా కూటమి ఏర్పడడానికి కారణం నితీశ్ కుమార్. ఆయన చొరవ వల్లే ఇది సాధ్యమైంది. కానీ...ఆయన ఇలా యూటర్న్ తీసుకుంటారని అనుకోలేదు. కాంగ్రెస్ ఇంకాస్త చొరవ తీసుకుని ఆయనకు నచ్చజెప్పాల్సింది. అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు ఆమ్‌ఆద్మీ పార్టీ కొంత అసంతృప్తితో ఉన్నాయి. అలా జరగకుండా కాంగ్రెస్ చూసుకోవాల్సింది"
- అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్
రాహుల్‌తో కలిసి ప్రచారం..?
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీతో కలిసి ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకీ సమాధానమిచ్చారు అఖిలేష్ యాదవ్. అది కాలమే నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ ప్రధాని పదవి కోసం ఆశపడలేదని, అసలు ఆ రేసులో లేనని స్పష్టం చేశారు. ఓ స్థానిక పార్టీగా తమ బలమేంటో తమకు తెలుసని, ఆ ప్రకారమే తమ వ్యూహరచన ఉంటుందని చెప్పారు. ఇక విపక్ష కూటమి విషయంలో ఆయన అసహనంగా ఉండడానికి కారణం...సీట్‌ల పంపకాల్లో కాంగ్రెస్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం. ఎంతకీ తేల్చకపోవడం వల్ల నితీశ్ అసహనానికి గురవుతున్నారు. ఒక్క బిహార్‌లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అందుకే ఆయన కూటమి నుంచి బయటకు వచ్చేయాలని భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మరో రెండు రోజుల్లో బీజేపీతో పొత్తుని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు. జనవరి 28న JDU,BJP కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అదే రోజున నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారట. సుశీల్ మోదీకి డిప్యుటీ సీఎం పదవి దక్కే అవకాశాలున్నాయి.
గతేడాది జులైలో NDAని ఓడించడమే లక్ష్యంగా I.N.D.I.A కూటమి ఏర్పడింది. ఈ కూటమి ఏర్పాటులో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలను కలపడంలో చొరవ చూపించారు. ఆ తరవాత ఆయనే కాంగ్రెస్‌పై కాస్త అసహనం వ్యక్తం చేశారు. కూటమిలో కాంగ్రెస్ పెద్దగా చురుగ్గా ఉండడం లేదని అన్నారు. ఈ విమర్శలతో ఒక్కసారిగా కూటమిలో అలజడి రేగింది. ఆ తరవాత ఓ భేటీలో ప్రధాని అభ్యర్థిగా ఖర్గేని ప్రతిపాదించడంపైనా నితీశ్ చుర్రుబుర్రులాడారు.
Also Read: ఉత్తరాఖండ్‌లో త్వరలోనే యునిఫామ్ సివిల్ కోడ్! అమలుకి సిద్ధమవుతున్న ప్రభుత్వం