Nitin Gadkari: 


తప్పుదోవ పట్టించారా..? 


కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ మధ్య ఎలాంటి కామెంట్స్ చేసినా...అవి కేంద్రానికి వ్యతిరేకంగానే ఉంటున్నాయన్న ప్రచారం బాగా జరుగుతోంది. ఇప్పటికే రెండు సార్లు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్న ఆయన...తరవాత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తన ఉద్దేశం అది కాదని, కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు గడ్కరీ. ఇప్పుడు మరోసారి ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. "భారతదేశం పేదలు ఎక్కువగా ఉన్న ధనిక దేశం" అని గడ్కరీ కామెంట్ చేసినట్టుగా ఓ వార్త చక్కర్లు కొట్టింది. కేంద్రంపై మరోసారి అసహనం వ్యక్తం చేశారనీ కొందరు అన్నారు. అయితే...తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన వివరణ ఇచ్చారు. సమాజాన్ని ఎంతో కాలంగావేధిస్తున్న సమస్యల గురించి ప్రస్తావించానని వెల్లడించారు. 










ఆ స్పీచ్‌లోనే..


"నాగ్‌పూర్‌లో నేను ఇచ్చిన ప్రసంగంలో భారతదేశం పేదలు ఎక్కువగా ఉన్న ధనిక దేశం అన్న వ్యాఖ్యల అసలు ఉద్దేశం వేరు. అదే సమయంలో నేను మన సమాజంలో ఉన్న ఎన్నో సమస్యల గురించి చర్చించాను. అందులో ఉన్న అసలు విషయం ఏంటో గ్రహించకుండా కావాలనే కొన్ని క్లిప్స్‌ తీసి తప్పుదోవ పట్టిస్తున్నారు" అని ట్విటర్ వేదికగా స్పందించారు నితిన్ గడ్కరీ. "నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిసి బాధ కలుగుతోంది. అక్కడ నేను మాట్లాడిన సందర్భం వేరు. దాన్ని వేరే సందర్భానికి ఆపాదించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు" అని అసహనం వ్యక్తం చేశారు. RSS అనుబంధ సంస్థ అయిన భారత్ వికాస్ పరిషద్‌ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆ ఫుల్‌ స్పీచ్‌ వీడియోని కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ స్పీచ్‌లో "ప్రపంచంలోనే భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగినప్పటికీ...కొందరు ఇంకా పేదలుగానే ఉండిపోతున్నారు. ఆకలి, నిరుద్యోగం, అస్పృశ్యత లాంటి సమస్యలు ఉన్నాయి. ధనికులు, పేదల మధ్య ఉన్న దూరం బాగా పెరిగిపోయింది. దీన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి" అని అన్నారు గడ్కరీ.  


గతంలోనూ ఇంతే..


గతంలోనూ ఇలాంటి అనుభవాలే ఆయనకు ఎదురయ్యాయి. కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ముంబయిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...మోదీ సారథ్యంలోని ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవటం లేదని అన్నారు. 
"అనుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు. ఆ సామర్థ్యం కూడా మనకుంది. భవిష్యత్‌లో భారత్‌లోని మౌలిక వసతులు మెరుగవ్వాలనేదే నా ఆకాంక్ష. మెరుగైన టెక్నాలజీని, ఆవిష్కరణలను మనం యాక్సెప్ట్ చేయాలి. వాటిపై అధ్యయనం చేయాలి. నాణ్యతలో రాజీ పడకుండానే... మనం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకోవాలి. ధరలు తగ్గించే ప్రయత్నాలు చేయాలి. నిర్మాణ రంగంలో సమయమే అత్యంత కీలకం. సమయమే పెట్టుబడి. కానీ...మన ప్రభుత్వంతో వచ్చిన సమస్యేంటంటే...సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోవటం లేదు" అని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.టెక్నాలజీ, రీసోరెస్స్ కన్నా సమయం ఎంతో విలువైందని అభిప్రాయపడ్డారు. ముంబయిలో జరిగిన NATCON ఈవెంట్‌లో ఈ కామెంట్స్ చేశారు. పార్లమెంటరీ బోర్డ్‌ నుంచి నితిన్ గడ్కరీ నుంచి అధిష్ఠానం తప్పించిన తరవాత..ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం హాట్‌ టాపిక్‌గా మారింది.