India Canada Tensions: 



మార్చిలో కాన్సులేట్‌పై దాడి


ఈ ఏడాది మార్చి నెలలో అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్‌పై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడి చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అప్పటి నుంచే ఖలిస్థాన్‌ వేర్పాటువాదులు, భారత్ మధ్య ఘర్షణలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ అల్లర్లు అమెరికాతో పాటు కెనడాలోనూ మొదలయ్యాయి. ఇప్పుడవి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అయితే...ఈ అల్లర్లకు శాన్‌ ఫ్రాన్సిస్కోలో జరిగిన దాడే ట్రిగ్గర్ పాయింట్‌గా మారింది. అందుకే...ఆ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించింది కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA). 10 మంది నిందితుల ఫొటోలనూ విడుదల చేసింది. వీళ్ల గురించి ఏ సమాచారం తెలిసినా వెంటనే తెలియజేయాలని ప్రజలను విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి మూడు నోటీసులు విడుదల చేసినట్టు NIA వెల్లడించింది. ఈ నిందితుల గురించి ఎవరు సమాచారం అందించినా వాళ్ల వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌లోనే ఈ ఘటనపై NIA కేసు నమోదు చేసింది. Unlawful Activities (Prevention) Act తో పాటు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. కానీ...వీళ్ల గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. 



ఖలిస్థాన్ నినాదాలు..


ఈ ఏడాది మార్చి 18,19వ తేదీల్లో భారత రాయబార కార్యాలయంపై ఈ దాడులు జరిగాయి. అక్రమంగా లోపలకి చొరబడిన ఖలిస్థాన్ వేర్పాటువాదులు నానా బీభత్సం సృష్టించారు. ఖలిస్థాన్ జెండాలతో నినాదాలు చేశారు. ఈ కార్యాలయం ప్రాంగణంలోనే ఖలిస్థాన్ జెండాలు పెట్టారు. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఈ దాడిని ఖండించింది. రాయబార కార్యాలయ భద్రతకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పింది. ఆ తరవాత కూడా ఖలిస్థాన్ మద్దతుదారులు రాయబార కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. లోపల సిబ్బంది ఉండగానే నిప్పంటించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై వెంటనే రావడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.