New Parliament Building: 


విపక్షాలపై అమిత్‌ షా ఫైర్..


కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరు కామని 19 పార్టీలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్‌తో పాటు దాదాపు అన్ని విపక్షాలూ బైకాట్ చేశాయి. దీనిపై బీజేపీ విమర్శలు చేస్తోంది. అనవసరంగా రచ్చ చేస్తున్నారంటూ మండి పడుతోంది. కేంద్రహోం మంత్రి అమిత్‌ షా కూడా ఇదే విషమయై విపక్షాలపై విమర్శలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"కావాలనే కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది. దేశ ప్రజలందరి ఆశీర్వాదం ప్రధాని మోదీపై ఉంది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీని అప్పట్లో సోనియా గాంధీ ప్రారంభించారు. అప్పటి గవర్నర్‌ని పక్కన పెట్టి మరీ సోనియా గాంధీ ఆ అసెంబ్లీని ప్రారంభించారు. అప్పుడు గవర్నర్‌ని ఎందుకు ఆహ్వానించలేదు. ఆ తరవాత ఝార్ఖండ్, మణిపూర్, అసోంలోనూ కాంగ్రెస్ ఇదే విధంగా చేసింది. తమిళనాడులోనూ ఇదే జరిగింది. మీరు చేస్తే తప్పు కాదు. అదే మోదీ చేస్తే మాత్రం బైకాట్ చేస్తారా...?" 


- అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి 


ఇదే సమయంలో 2024 ఎన్నికల ప్రస్తావనా తీసుకొచ్చారు అమిత్‌షా. ప్రధాని మోదీకి ప్రజలు రెండు సార్లు ఓటు వేశారని, కాంగ్రెస్‌ని ఎవరూ పట్టించుకోడం లేదని మండి పడ్డారు. 


"ప్రధాని మోదీని ప్రజలు రెండు సార్లు ఆశీర్వదించారు. భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. కాంగ్రెస్‌పై దేశ ప్రజలకు అభిమానం ఎప్పుడో పోయింది. కాంగ్రెస్‌కి నేను చెప్పేదొక్కటే. ప్రధాని మోదీకి ప్రజల అండ ఉంది. ఈ సారి 300 సీట్లకుపైగా సాధించి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్‌ చేసే ప్రతి పనినీ ప్రజలు గమనిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. ఇప్పుడూ అదే జరుగుతుంది"


- అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి 


కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై దేశవ్యాప్తంగా రాజకీయాలు ముదిరాయి. అన్ని పార్టీలనూ ఆహ్వానించామని బీజేపీ చెబుతున్నప్పటికీ.. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు విపక్షాలు ఆసక్తి చూపించడం లేదు. దీనిపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇప్పుడీ వివాదం సుప్రీంకోర్టు గడప తొక్కింది. కొత్త పార్లమెంట్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతికి తగిన గౌరవం కల్పించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా లోక్‌సభ సెక్రటేరియట్ రాజ్యాంగ విలువల్ని కించపరిచారని ఆరోపించారు. లాయర్ జయసుకీన్ ఈ  పిటిషన్ వేశారు. ఇప్పటికే 19 పార్టీలు తాము హాజరు కావడం లేదని లెటర్ రాశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత మాత్రమే పార్లమెంట్‌ని ఓపెన్ చేయించాలని డిమాండ్ చేశాయి. కానీ...బీజేపీ మాత్రం దీనిపై గట్టిగానే వాదిస్తోంది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండి పడుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ ఈ అంశంలో ఒక్కటయ్యాయి. మహారాష్ట్ర ఉద్ధవ్ థాక్రే శివసేన నేత సంజయ్ రౌత్ తమ స్టాండ్ ఏంటో తేల్చి చెప్పారు. ఈ విషయంలో విపక్షాలతోనే కలిసి వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. పార్లమెంట్‌ అధినేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పక్కన పెట్టి...మోదీ స్వయంగా ప్రారంభించడాన్ని తప్పు పట్టారు.


Also Read: Rs 75 Coin: రూ.75 కాయిన్ విడుదల చేయనున్న ప్రధాని మోదీ, పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజునే