దేశంలో వరుసగా రెండోరోజూ కరోనా కేసులు 40వేలకుపైగా నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 600పైనే మరణాలు సంభవించాయి. అలాగే రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
- తాజాగా 17,28,795 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 43,509 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.15కోట్ల మార్కును దాటాయి.
- కేరళలో 22వేల కేసులు, మహారాష్ట్రలో 6,857 కేసులు బయటపడ్డాయి. దేశంలో నమోదవుతోన్న కొత్త కేసుల్లో ఈ రెండు రాష్ట్రాలదే సగానికిపైగా వాటా ఉంటోంది.
- కొవిడ్ ధాటికి నిన్న మరో 640మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4.22లక్షలకు చేరింది.
- నిన్న 38,465 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తంమీద 3.07కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 97.38 శాతంగా ఉంది.
- ప్రస్తుతం 4,03,840 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోసారి క్రియాశీల కేసులు నాలుగులక్షలకు ఎగువన నమోదయ్యాయి. క్రియాశీల రేటు 1.28 శాతానికి చేరింది.
- నిన్న 43,92,697 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన టీకాల సంఖ్య 45కోట్ల మార్కు దాటింది.
ప్రమాదంగా డెల్టా వైరస్..
గత ఏడాది.. కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గరకు వెళ్లినప్పటి నుంచి ఇన్‌ఫెక్షన్ బారినపడటానికి మధ్య సరాసరిన ఆరు రోజుల వ్యవధి ఉండేది. డెల్టా వేరియంట్ విషయంలో ఇది నాలుగు రోజులకు పడిపోయింది. దీంతో ఇన్‌ఫెక్షన్ సోకడానికి ముందే వారిని గుర్తించడం మరింత కష్టమవుతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. తాము గుర్తించేటప్పటికే.. బాధితుడిగా దగ్గరగా వచ్చిన వారిలో 100 శాతం మంది ఇన్‌ఫెక్షన్ బారినపడుతున్నారని ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ అధికారులు తెలిపారు. గత ఏడాది అది 30 శాతం మాత్రమే ఉండేదని చెప్పారు. బాధితుడికి దగ్గరగా వెళ్లిన వ్యక్తి నుంచి 24 గంటల్లోనే వైరస్ వ్యాప్తి మొదలవుతున్న ఉదంతాలు దక్షిణ ఆస్ట్రేలియాలో వెలుగు చూశాయన్నారు.
నియంత్రణ చర్యలే శరణ్యం..
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వేగంగా టీకా వేసేంత స్థాయిలో వ్యాక్సిన్లు లేకపోవడం వల్ల కరోనా కట్టడికి పలు నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. ముమ్మరంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా కొత్త కేసులను గుర్తించి, వారిని వేగంగా విడిగా ఉంచాలన్నారు. అలాగే ఇన్‌ఫెక్షన్ సోకినవారికి దగ్గరగా వచ్చినవారిని సత్వరం గుర్తించి, వారిని ఏకాంతంలో ఉంచాలని సూచించారు. వ్యాధి లక్షణాలు లేనివారు, లక్షణాలు మొదలు కావడానికి ముందు దశలో ఉన్నవారి నుంచి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలతోపాటు ఇవి చాలా కీలకమని వివరించారు.