GetOutRavi hashtag: తమిళనాడు గవర్నర్ ఆర్‌ ఎన్ రవికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కాలం నుంచి మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా గురువారం మొత్తం ట్విట్టర్‌లో GetOutRavi (గెట్ ఔట్ రవి) హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఎందుకు ఇది ట్రెండింగ్‌లో ఉంది. గవర్నర్‌కు డీఎంకే ప్రభుత్వానికి మధ్య వివాదమేంటి ఓ సారి చూద్దాం


ఇదీ సంగతి


తమ రాష్ట్ర గవర్నర్ రవిని తొలగించవలసిందిగా కోరుతూ ఎమ్‌కే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సహా దాని మిత్ర పక్షాలు ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇటీవల పిటిషన్ పంపాయి. గవర్నర్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని, మత విద్వేషాన్ని రెచ్చగొట్టేట్టుగా వ్యవహరిస్తున్నారని డీఎంకే ఆరోపించింది. గవర్నర్ రవి 'సనాతన ధర్మాన్ని' పొగుడుతున్నారని అందులో పేర్కొంది.


బిల్లులు


అంతేగాక ఎన్నో బిల్లులను ఆమోదించకుండా తొక్కిపట్టి ఉంచుతున్నారని డీఎంకే పేర్కొంది. నవంబర్ 2న రాష్ట్రపతి భవన్‌కు పంపిన తమ పిటిషన్ తాలూకా ప్రతిని డీఎంకే ఇటీవల విడుదల చేసింది. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్‌తో పాటు ఇతర పార్టీలు .. గవర్నర్‌పై తీవ్ర ఆరోపణలు చేశాయి.


నేషనల్ ఎంట్రెన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్.. 'నీట్' పరిధి నుంచి రాష్ట్రాన్ని మినహాయించవలసిందిగా కోరుతూ పంపిన బిల్లుకు ఇప్పటివరకు ఆయన నుంచి సమాధానం లేదని తెలిపాయి. ఇంకా చాలా బిల్లులను పెండింగ్‌లో ఉంచారని పేర్కొన్నాయి.


పేలుడు కేసు


కోయంబత్తూరులో ఇటీవల జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని గవర్నర్ రవి ఆరోపించారు. అది కూడా సీఎం స్టాలిన్ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం కలిగించింది. తాజాగా ఆన్‌లైన్ రమ్మీ కారణంగా ఆత్మహత్యలు చేసుకొని చిదిగిపోయిన కుటుంబాల బాధ్యత కూడా గవర్నర్‌దేనని డీఎంకే ఆరోపిస్తోంది. ఎందుకంటే ఆన్‌లైన్ రమ్మీని నిషేధిస్తూ తమిళనాడు సర్కార్ ఇటీవల ఆమోదించిన జీవోపై కూడా గవర్నర్ ఇంతవరకు సంతకం చేయలేదని తెలిపింది.


Also Read: Shraddha Murder Case: అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్ పూర్తి- రెండు గంటల పాటు ప్రశ్నలు