YSRCP BC Meeting :   డిసెంబర్ 7న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో "జయహో బీసీ మహా సభ" కు వైఎస్ఆర్‌సీపీ  ఏర్పాట్లు ప్రారంభించింది.ఈ సభకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హజరు కానున్నారు.  84 వేల మంది బీసీ ప్రతినిధులను సభకు ఆహ్వానించారు.  సభకు తరలి రావాలంటూ బీసీ వర్గాలకు ఫోన్లు చేసి ఆహ్వానించాలని,సభ జరిగేంత వరకు బీసీ వర్గాల ఫోన్లు మారుమోగించండని ఆయన పార్టీ శ్రేణులకు మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. 


జయహో బీసీ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, సీనియర్ నేతలు 
 
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న "జయహో బీసీ మహా సభ" ఏర్పాట్లను పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు పరిశీలిచారు.  "జయహో బీసీ మహా సభ-వెనుకబడిన కులాలే వెన్నెముక.. అన్న నినాదంతో" బీసీ మహా సభ పోస్టర్ ను వారు విడుదల చేశారు.   దాదాపు 84 వేల మందికి పైగా బీసీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యే ఈ మహా సభను విజయవంతం చేయాలని  వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి  కోరారు.  గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు వరకు ఆయా పదవుల్లో ఉన్న ప్రతి ఒక్క బీసీ ప్రజాప్రతినిధి తప్పనిసరిగా ఈ సభకు హాజరుకావాలని, ఒకవేళ ఎవరికైనా ఆహ్వానాలు అందకపోయినా, ఇదే ఆహ్వానంగా భావించి సభకు రావాలని విజయసాయిరెడ్డిగారు విజ్ఞప్తి చేశారు.  


ప్రభుత్వ,  పార్టీల్లో పదవులు పొందిన వారందరికీ ఆహ్వానం 



ఈ మహాసభకు గ్రామ పంచాయితీల్లోని వార్డు సభ్యుల నుంచి ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న వారందరూ దాదాపు 84 వేల మంది బీసీ ప్రతినిధులు హాజరుకానున్నారని విజయసాయి రెడ్డి ప్రకటించారు.  7వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ మహాసభ ప్రారంభం అవుతుంది. 12 గంటలకు ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌  హాజరై ప్రసంగిస్తారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది... రాబోయే కాలంలో ఏం చేయబోతుంది అనేది ముఖ్యమంత్రి  వివరిస్తారు. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ పదవులు పొందిన ప్రతి ఒక్క బీసీ ప్రతినిధులను ఈ సభకు ఆహ్వనిస్తున్నారు. 


తర్వాత ప్రాంతీయ సమావేశాల ఆలోచనలు


బీసీ మహాసభ తర్వాత  రీజనల్‌ స్థాయిలో జోనల్‌ సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, ప్రణాళిక బద్దంగా బీసీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు జ్యోతిరావుపూలే జయంతి నాటికి సమావేశాలన్నింటినీ పూర్తి చేయాలని నిర్ణయించారు.  సభకు ఆహ్వనిస్తూ బీసీ వర్గాలకు విర విగా ఫోన్లు చేయాలని బొత్స పార్టీ నేతకు సూచించారు.  ఈ బాధ్యతను ప్రత్యేకంగా ఒకరికి అప్పగించి ,వారికి ఫోన్ నెంబర్లు ఇచ్చి, ఫోన్లు చేసి ఆహ్వనించటమే పనిగా చేయాలన్నారు . పదవులు పొందిన బీసీలకు అధికారాలు లేవన్న విమర్శలు హాస్యాస్పదమని బోత్స అన్నారు.  ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వారికి మేమున్నాం అనే ధైర్యాన్ని, భరోసాను ఇవ్వడమే మా పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. బీసీ మహాసభ తర్వాత ఎస్సీ, ఎస్టీల సభలు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు.