Russia Ukriane War Updates: రష్యాలో ఉద్యోగాల పేరిట భారీ మోసం జరుగుతోందని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొంత మందిని ఉద్యోగాల పేరిట రష్యాకి తీసుకెళ్లి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోకి బలంవంతంగా పంపుతున్నారు. ఇలా ఈ వలలో చిక్కుకుని ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నేపాల్‌కి చెందిన నలుగురు వ్యక్తులు తమను కాపాడాలంటూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. తమని మోసం చేసి ఇలా యుద్ధంలోకి లాగారని, ఆర్మీకి హెల్పర్స్‌గా ఉండాలని బలవంతం చేస్తున్నారని చెప్పారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో తమనీ పోరాడాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలిపారు.
"మమ్మల్ని ఉద్యోగం పేరిట ఇక్కడికి తీసుకొచ్చి రష్యన్ ఆర్మీకి హెల్పర్స్‌గా బలవంతంగా నియమించారు. మేం నేపాల్ నుంచి ఇక్కడి వరకూ వచ్చాం. మా ఏజెంట్ అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. మేం చాలా ఇబ్బందులు పడుతున్నాం. రష్యన్ ఆర్మీకి హెల్పర్స్‌గా పని చేయాలని చెబుతున్నారు. కానీ ఇక్కడ మేం నేరుగా యుద్ధం చేయాల్సి వస్తోంది"
- బాధితులు
తమతో పాటు ఇన్నాళ్లూ ఉన్న భారతీయులంతా ఇండియాకి సేఫ్‌గా వెళ్లిపోయారని చెప్పిన బాధితులు, తమనీ సురక్షితంగా నేపాల్‌కి చేర్చాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నేపాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే భారత్ సాయం కోరుతున్నట్టు చెప్పారు.
"భారత్ మాకు సాయం చేస్తుందని నమ్ముతున్నాం. భారత్, నేపాల్ మధ్య మైత్రి ఎంతో బలంగా ఉంది. మా నేపాల్ ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందడం లేదు. అందుకే మిమ్మల్ని సాయం కోరుతున్నాం. మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. ఈ నరకం నుంచి బయటపడేయండి"
- బాధితులు
కొంత మంది భారతీయుల్ని బలవంతంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి పంపుతున్నారన్న వార్తలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఓ భారతీయుడు అక్కడ జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని సంస్థలు హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నాయని స్పష్టం చేసింది. ఆయా ఏజెన్సీలపై CBI దాడులు సోదాలు నిర్వహించిందని వెల్లడించింది. అక్కడి బాధితులందరినీ గుర్తించి వీలైనంత త్వరగా భారత్‌కి రప్పించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఈ విషయం వెల్లడించారు.
"రష్యా ఆర్మీలో కొంతమంది భారతీయులతో బలవంతంగా యుద్ధం చేయిస్తున్నారు. ఈ విషయాన్ని మేం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇలా వాళ్లను తప్పుదోవ పట్టించిన ఏజెన్సీలపై కఠిన చర్యలకు ఆదేశించాం. రష్యన్ ఆర్మీకి సపోర్టింగ్ స్టాఫ్‌గా ఉన్న భారతీయుల్ని వీలైనంత త్వరగా ఆ చెర నుంచి విడిపించి ఇండియాకి భద్రంగా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం"
- రణ్‌ధీర్ జైస్వాల్, విదేశాంగ శాఖ ప్రతినిధి
Also Read: ట్యాబ్లెట్ స్ట్రిప్స్‌పై రెడ్‌లైన్‌ని ఎప్పుడైనా గమనించారా? దాని అర్థమేంటో తెలుసా?