Nepal Aircraft Crash:
నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 72 మందితో కూడిన ఎయిర్‌క్రాఫ్ట్ పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై క్రాష్ అయింది.
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎంత మంది చనిపోయారు..? అన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ 72 మందిలో 68 మందిప్రయాణికులు కాగా..మిగతా నలుగురు విమాన సిబ్బంది. ఓల్డ్ ఎయిర్‌పోర్ట్, పొఖారా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మధ్య ఫ్లైట్ క్రాష్ అయినట్టు Yeti Airlines వెల్లడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖాట్మండు నుంచి పొఖారాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటివరకూ 40 మంది మృతదేహాలు వెలికి తీసినట్టు తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. వాతావరణం అనుకూలంగా లేని కారణంగా పొఖారా విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ చేసే సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు, పొగ రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ప్రాథమిక విచారణలో వాతావరణ పరిస్థితులు ప్రమాదానికి కారణం కాదని తేలింది. సాంకేతిక సమస్య కారణంగా ప్రమాదం సంభవించినట్టు తేలింది. ప్రయాణికుల్లో 5గురు భారతీయులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. క్రాష్ అయ్యే ముందు ఫ్లైట్‌లో నుంచి మంటలు వచ్చాయని వెల్లడించారు. పైగా ఈ విమానాన్ని దాదాపు 15 ఏళ్లుగా వినియోగిస్తున్నారు. ప్రమాదానికి ఇది కూడా ఓ కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ...అత్యవసర సమావేశానికి ఆదేశించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని సూచించారు.