డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి వందనాలు సమర్పించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పారిశుద్ధ్య కార్మికుల కాళ్లను శనివారం (జనవరి 14) కడిగారు. అనంతరం వారి శాలువాలు, పూలమాలలు వేసి సత్కరించారు. వారికి కొత్త బట్టలు వేసి ఘనంగా సత్కరించారు. వీరితో పాటు పోలీసులు, డాక్టర్లను కూడా సన్మానించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతకు భోగి, స్వేచ్ఛతకు సంక్రాంతి, సేవకు గుర్తుగా కనుమ పండుగ జరుపుకొంటారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.
రోజూ మనకు సేవలు అందించడంలో పారిశుద్ధ్య కార్మికులు ముందు నిలబడి పని చేస్తున్నారని కొనియాడారు. మన కోసం పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రతి ఒక్కరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం- స్వేచ్ఛను కల్పిస్తున్న పోలీసులకు, మన ఆరోగ్యానికి సేవలందిస్తున్న డాక్టర్లు హాస్పిటల్ సిబ్బందికి పాదాలు కడిగి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాదాం శెట్టి శ్రీదేవి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సంక్రాంతి వేడుకల్లో మంత్రి
రాజమహేంద్రవరం మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం (జనవరి 13) నాడు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి చెల్లుబోయిన పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర హోమంత్రి తానేటి వనిత, కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, కమిషనర్ కె దినేష్ కుమార్, రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భోగి మంటలు అంటించారు. కోలాటం ఆడారు, గంగిరెద్దులు, హరిదాసులు, కొమ్మదాసరిలతో సందడి చేశారు. పిండి వంటలు చేశారు. కార్యక్రమంలో ఖాదిబోర్డు చైర్ పర్సన్ పిల్లి నిర్మల, శెట్టి బలిజ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను, గుర్రం గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.