Nellore News : బిర్యానీ పేరు చెప్పగానే నోట్లో నీళ్లూరుతాయ్. కానీ నెల్లూరు వాసులు మాత్రం బిర్యానీ పేరు చెబితే హడలిపోతున్నారు. ఎందుకంటే అక్కడ బిర్యానీని స్పెషల్ గా కుళ్లిన చికెన్ తో తయారుచేస్తున్నారు.  కుళ్లిపోయిన చికెన్ ను నెల్లూరులోని హోటళ్లకు సరఫరా చేసేందుకు కొంతమంది రెడీ చేస్తున్నారు. సడన్ గా అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. హెల్త్ ఆఫీసర్ వెంకట రమణ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఏకంగా 400 కేజీల కుళ్లిన చికెన్ ని అధికారులు పట్టుకున్నారు. ఏదైనా వ్యాధితో కోళ్లు చనిపోయినా, లేదా నిల్వ ఉన్న చికెన్ అమ్ముడుపోకపోయినా దాన్ని చెన్నై నుంచి తక్కువరేటుకి నెల్లూరుకి చెందిన ఆరిఫ్ తెప్పించుకుంటాడు. ప్రతి రోజూ ఇలా కుళ్లిన చికెన్ ని తీసుకొచ్చి పేరున్న హోటళ్లకు తక్కువ రేటుకి సరఫరా చేస్తుంటాడు ఆరిఫ్. వేడి వేడిగా వడ్డిస్తే ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. అందుకే అది కుళ్లిందా లేదా అని చూసుకోకుండా తినేస్తుంటారు చాలామంది. ఇదే అదనుగా ఇలాంటి కుళ్లిన చికెన్ మాఫియా నెల్లూరులో చెలరేగిపోతోంది. ఇలా కుళ్లిన చికెన్ ని చాలాసార్లు అధికారులు పట్టుకున్నారు.  కానీ ఇప్పుడు మరోసారి ఇలా పెద్ద మొత్తంలో కుళ్లిన చికెన్ బయటపడటంతో స్థానికులు షాకయ్యారు. హోటళ్లకు వెళ్లి ఇలాంటి చికెన్ తింటున్నామా అంటూ భయపడుతున్నారు. 


బిర్యానీ తింటే మగాళ్లకు ఆ సామర్థ్యం తగ్గిపోతుందట!


ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకునే తృణమూల్ కాంగ్రెస్ నేత రవీంద్రనాథ్ ఘోష్ (West Bengal TMC leader) ఇటీవల మరో వివాదంలో చిక్కుకున్నారు. బిర్యానీలో ఉపయోగించే మసాలా దినుసులు పురుషుల లైంగిక కోరికను నాశనం చేస్తాయని ఆయన ఆరోపించారు. అంతేకాదు కూచ్‌బెహార్ మునిసిపాలిటీలోని స్థానిక బిర్యానీ దుకాణాన్ని ఆయన బలవంతంగా మూసివేశారు. ఆ మునిసిపాలిటీకి ప్రస్తుతం ఆయన ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ ఆరోపణల వెనుక ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేకపోయినా రవీంద్రనాథ్ ఘోష్ తీవ్ర ఆరోపణలు చేశారు.


" బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు, మసాలాలు మగతనాన్ని తగ్గిస్తాయని వివిధ వర్గాల నుంచి ఆరోపణలు వచ్చాయి. కూచ్‌బెహార్ మున్సిపల్ పరిధిలో ఉన్న 'కోల్‌కతా బిర్యానీ షాప్' వాళ్లు పురుషుల లైంగిక సామర్థ్యాన్ని తగ్గించేలా బిర్యానీ కొన్ని పదార్థాలను ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అందుకే మేము వచ్చి దుకాణాన్ని మూసివేశాం.  ఈ దుకాణం మాత్రమే కాదు. చాలా చోట్ల రోడ్లకు ఇరువైపులా స్థలాన్ని పలువురు ఆక్రమించారు. రోడ్లపైనే వంటలు చేస్తున్నారు. వారు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు. వాళ్లంతా బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చినవారు కావచ్చు. ఈ దుకాణాలు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటున్నాయి. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ప్రజలు మద్యం సేవించి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. వారికి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్‌లు లేవు. కొంతకాలం మాత్రమే వ్యాపారం చేస్తారు. ఈ వ్యక్తుల గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ వ్యక్తులు ఎవరో? వారు ఎక్కడ నుండి వచ్చారో తెలుసుకోవడానికి మేము పోలీసులకు కూడా సమాచారం అందించాం. "-  రవీంద్రనాథ్ ఘోష్, టీఎంసీ నేత


అయితే మునిసిపాలిటీ వర్గాల సమాధానం వేరుగా ఉంది. మునిసిపల్ ప్రాంతంలోని క్లీనింగ్ ప్రక్రియలో భాగంగా అక్రమ దుకాణాల తొలగింపు డ్రైవ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా సరైన ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్‌తో వ్యాపారం చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే, అనేక ఇతర దుకాణాలు, సంస్థలు అక్రమంగా నడుస్తున్నప్పుడు ఒకే దుకాణాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.