నీట్ పరీక్ష వాయిదా గురించి అధికార బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సెప్టెంబర్ 12న జరగాల్సిన నీట్ యూజీ పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ నేతలు చేస్తోన్న డిమాండ్‌ను బీజేపీ నేతలు తోసిపుచ్చారు. ఇక ఇటీవల ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు సైతం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ యూజీ పరీక్షను వాయిదా లేదా రీషెడ్యూల్ చేయాలని విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. పరీక్షలను వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది. 


సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా విద్యార్థులు గళం విప్పారు. ట్విట్టర్ వేదికగా నీట్ యూజీ పరీక్ష వాయిదా వేయాలంటూ పోస్టులు చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. 


ఈ డిమాండ్లపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు స్పందించారు. రాహుల్ గాంధీ ఒక ‘సూడో ఎక్స్‌పర్ట్’ అని విమర్శించారు. రాహుల్ తనకు లేని గుర్తింపును కోరుకుంటారని.. తానంతట తానే ఒక నిపుణుడిలా భావిస్తారని ఎద్దేవా చేశారు. నీట్ పరీక్షలను వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు, నిపుణులు చెప్పిన తర్వాత కూడా ఆయన ఈ ట్వీట్ చేయడం ఏంటని నిలదీశారు. ఇది సుప్రీం వ్యాఖ్యలను తప్పుబట్టడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.







Also Read: Coronavirus India Update: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 43 వేల కేసులు, 338 మరణాలు


Also Read: Andhra Pradesh: గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్... పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం... బాధితుల ఫిర్యాదు పట్టించుకోని పోలీసులు!