జీరో ఎఫ్ ఐ ఆర్ ఒకటుందని పోలీసులందరకీ తెలుసా..ఘటన ఎక్కడ జరిగినా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ కి బదిలీచేయాలనే విషయం స్ఫురణలో లేదా..గుంటూరు జిల్లాలో బాధితుల ఫిర్యాదును సత్తెనపల్లి పోలీసులు ఎందుకు తీసుకోలేదు. ఏం జరిగిందంటే..గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం రాత్రి వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరులో ఓ వివాహానికి హాజరై బైక్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా మేడికొండూరు అడ్డురోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దంపతులను అడ్డగించిన కొందరు దుండగులు భర్తపై దాడిచేసి భార్యను సమీపంలో ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
దీనిపై బాధితులు అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. పైగా ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని తమ పోలీస్‌స్టేషన్ గుంటూరు రూరల్ పరిధిలో ఉంటుందన్నారు. అంత కష్టంలో పోలీసులను ఆశ్రయించిన ఆ బాధితులు ఏం చేయాలో పాలుపోక వెనుతిరిగారు. ఈవిషయం తెలిసినవారంతా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలనే విషయం వారికి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read:తెలంగాణలో 'మెడిసన్ ఫ్రం స్కై'.. డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్లు.. నేటి నుంచి ట్రయల్స్
‘జీరో ఎఫ్ ఐ ఆర్’ ఉందని తెలుసా అసలు...
వాస్తవానికి జీరో ఎఫ్ ఐ ఆర్ ఉందనే విషయం చాలామంది పోలీసులకు తెలియదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చాలా కేసుల్లో బాధితులకు ఇదే పరిస్థితి ఎదురైంది. కొందరు పోలీసులు ఆ క్షణం బాధ్యతల నుంచి తప్పుకునేందుకు తమ పరిధికాదనే ఆయుధాన్ని వాడుతుంటారనే విమర్శలున్నాయి. వాస్తవానికి జీరో ఎఫ్ ఐఆర్ పై పోలీసులతో పాటూ ప్రజలకూ అవగాహన అవసరం. ఎందుకంటే ఏదైనా కష్టంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాళ్లు తమ పరిధి కాదని అంటే అప్పుడు ‘జీరో ఎఫ్ ఐ ఆర్’ చెయ్యండని అడగాలి.
‘జీరో ఎఫ్ ఐ ఆర్ అంటే’
మన ఫిర్యాదు ఏ స్టేషన్ పరిధి లోదో తెలియనప్పుడు మనం ఎక్కడైతే ఫిర్యాదు చేసామో అక్కడ జీరో ఎఫ్ ఐ ఆర్ గా నమోదు చేసి తరువాత సంబంధిత స్టేషన్ ఏదో తెలుసుకుని ఆ ఎఫ్ ఐ ఆర్ ను ఆ స్టేషన్ కు పోలీసులు బదిలీ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఘటన తీవ్రతను బట్టి ఎక్కడ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎఫ్ ఐ ఆర్ రాసి సంబంధిత స్టేషన్ కు పంపించాల్సిందే. ఇది తమ పరిధికాదని చెప్పే అవకాశమే పోలీసులకు లేదు. ఎవరైన బాధితులు తాము ఫిర్యాదు చేసినా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదుకు నిరాకరిస్తే పోలీసులపై క్రిమినల్ చర్యలు తప్పవని ఇప్పటికే కేంద్ర హోంశాఖ సైతం హెచ్చరించింది. అయినప్పటికీ పరిస్థితిలో మార్పులేదంటున్నారంతా.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
Also read: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు.. ఆ ఐదు జిల్లాల వారికి అలెర్ట్..
Also read: పసిడి ప్రియులకు ఈ రోజు కూడా శుభవార్త..నిన్నటి కన్నా మరింత తగ్గిన బంగారం ధర