NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్‌లో ఈ తరహా పేపర్ లీక్‌లు కాకుండా ప్రత్యేకంగా చట్టం తీసుకు రానుంది. లీక్ రాయుళ్లను పూర్తి స్థాయిలో కట్టడి చేయనుంది. పేపర్ లీక్‌కి పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టంలో ప్రొవిజన్స్ చేసింది. భారీ జరిమానాలతో పాటు బుల్‌డోజర్‌లో ఇళ్లు కూలగొట్టడం, జైలుకి పంపడం లాంటి చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు యోగి సర్కార్ అంతా సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్‌తో National Testing Agency (NTA) పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డార్క్‌నెట్ వేదికగా పేపర్ లీక్ అయిందని కేంద్రవిద్యాశాఖ వెల్లడించింది. దీంతో పాటు మరి కొన్ని అవకతవకలూ జరిగినట్టు విచారణలో తేలింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎగ్జామినేషన్ ప్రాసెస్‌లో ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. పేపర్ కౌంటింగ్‌ని కట్టడి చేసేందుకూ కొత్త చట్టం తీసుకురానుంది. పేపర్ ప్రింటింగ్ బాధ్యతల్ని రెండు వేరు వేరు ఏజెన్సీలకు అప్పగించి లీక్‌లను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. పేపర్ కోడింగ్ ప్రక్రియనూ మరింత కఠినతరం చేసే యోచనలో ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలలో మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించాలని భావిస్తోంది. క్లీన్ చిట్ ఉన్న కాలేజీల్లోనే పరీక్షలు నిర్వహించనుంది.
ఇవీ చర్యలు..
ఎగ్జామ్ సెంటర్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయనుంది. ఇక ఎగ్జామ్ నిర్వహణ బాధ్యతలు నాలుగు వేరు వేరు ఏజెన్సీలకు అప్పగించాలని యోగి సర్కార్ భావిస్తోంది. ఇక పరీక్ష రాసే అభ్యర్థులకు సొంత ఊరిలో కాకుండా వేరే చోట ఎగ్జామ్ సెంటర్ వచ్చేలా ప్లాన్ చేయనుంది. ఈ నిబంధన నుంచి దివ్యాంగులకు, మహిళలకు మినహాయింపు ఉంటుంది. 4 లక్షల కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే రెండు విడతల్లో నిర్వహించాలని యోచిస్తోంది. Provincial Civil Service ఎగ్జామ్‌ని మాత్రం ఒకే విడతలో నిర్వహించాలని చూస్తోంది. ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు రాకుండా OMR షీట్స్‌ని స్కాన్ చేయనుంది. క్వశ్చన్ పేపర్స్‌కి యునిక్ బార్‌కోడ్స్,సీరియల్ నంబర్స్ పెట్టనున్నారు. పేపర్‌ల రవాణాలోనూ ఎక్కడా ట్యాంపర్ కాకుండా చాలా పక్కాగా ప్యాక్ చేసేలా చూడనున్నారు. ప్రింటింగ్ ఏజెన్సీలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని యోగి సర్కార్ చూస్తోంది. ప్రింటింగ్ ప్రెస్‌ల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించనుంది యూపీ ప్రభుత్వం. ఎవరికి పడితే వాళ్లకి కాకుండా అథెంటికేషన్ ఉన్న వాళ్లకే ఆ బాధ్యతలు అప్పగించనుంది. ప్రింటింగ్ ప్రెస్‌లోకి వచ్చే వాళ్లను స్క్రీనింగ్ చేస్తారు. ID కార్డులుంటే తప్ప లోపలికి అనుమతించరు. ఇక బయటి వ్యక్తులకు ఏ మాత్రం అనుమతి ఉండదు. ప్రింటింగ్ ప్రెస్‌లో స్మార్ట్ ఫోన్‌లు, కెమెరాల వినియోగంపై ఆంక్షలు విధించనుంది. ప్రింటింగ్ ప్రెస్ చుట్టూ సీసీ కెమెరాలు పెట్టనున్నారు. దాదాపు ఏడాది పాటు అందులో రికార్డ్స్ ఉండేలా చూసుకోనున్నారు.