Sharad Pawar:


ఇది సహించరాని నిర్ణయం: శరద్ పవార్ 


పార్లమెంట్ ఆవరణలో నిరసనలు, ధర్నాలు చేపట్టేందుకు వీల్లేదన్న ఆదేశాలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP అధినేత శరద్ పవార్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది ప్రజాస్వామ్య హక్కుల్ని హరించటమేనని మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న నేతల హక్కులపై దాడిగా అభివర్ణించారు. పార్లమెంట్ ఆవరణలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని రాజ్యసభ సెక్రటేరియట్ ఓ సర్క్యులర్ జారీ చేయటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో "రొటీన్‌"గానే ఈ ఆదేశాలు ఇచ్చామని అథారిటీస్ చెబుతున్నాయి. పవార్ మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. "ఇది ఏ మాత్రం సహించరాని నిర్ణయం" అని అన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ దిల్లీలో సమావేశమవుతున్నట్టు పవార్ వెల్లడించారు. ఈ నిర్ణయంపై ఎలా స్పందించాలనేది ఈ భేటీలో నిర్ధరిస్తామని చెప్పారు. జులై 18వ తేదీన వర్షాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. "ధర్నా, నిరసన ప్రదర్శన, ఆందోళన, నిరాహార దీక్ష, సమ్మె, ఏదైనా మతపరమైన కార్యక్రమం కోసం సభ్యులు ఇక పార్లమెంట్ ఆవరణను వినియోగించకోలేరు. ఇందుకు సభ్యులు సహకరించాలని కోరుతున్నాను" అని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ వెల్లడించారు.





 కేబినెట్ విస్తరణ ఎందుకు చేపట్టలేదు..? 


మహారాష్ట్ర రాజకీయాల గురించీ మాట్లాడారు శరద్ పవార్. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి శివసేన మద్దతు తెలపటం గురించి ప్రస్తావించారు. ప్రతి రాజకీయ పార్టీకి సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేనతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమి అలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. రానున్న ఎన్నికలను సవాలుగా తీసుకుని పోటీలోకి దిగుతామని చెప్పారు. అయితే ఈ కూటమి ఇలాగే కొనసాగాలా వద్దా అన్న నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదని అన్నారు. వ్యక్తిగతంగా అయితే మహా వికాస్ అఘాడీ కూటమి ఎన్నికల బరిలో  దిగాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మహారాష్ట్రను కేవలం ఇద్దరు వ్యక్తులే పరిపాలిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతవరకూ కేబినెట్ విస్తరణ ఎందుకు చేపట్టలేదో అర్థం కావట్లేదని, మహా వికాస్ అఘాడీ తీసుకున్న నిర్ణయాలను పక్కన పెట్టడం తప్ప ఏమీ చేయటం లేదని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యల వలయంలో కూరుకుపోతోందని, గట్టెక్కించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 


Also Read: RS Secretariat New Rules: ఇక పార్లమెంటు ఆవరణలో ధర్నా, నిరసనలకు నో- ఉత్తర్వులు జారీ చేసిన మోదీ!