పంజాబ్ లో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది. ‘నవీ సోచ్ నవ పంజాబ్’ పేరిట వర్చువల్ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీని కాంగ్రెస్ ఇటీవల కాలంలో అత్యంత విజయవంతమైన డిజిటల్ ర్యాలీలలో ఒకదానిని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీలోని వివిధ శాఖలు పూర్తి సమన్వయంతో గ్రాండ్ వర్చువల్ ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొంది. పంజాబ్‌లోని జలంధర్‌లోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఈ ర్యాలీని ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొ్న్నారు. కాంగ్రెస్ నేతలు ఈ ర్యాలీలో ప్రసంగించారు. జలంధర్ వేదిక ప్రారంభించిన డిజిటల్ ర్యాలీని రాష్ట్రంలోని 117 అసెంబ్లీ నియోజకవర్గాలు, పంజాబ్‌లోని 22 జిల్లా కేంద్రాల్లో ఎల్ఈడీల ద్వారా కనెక్ట్ చేశారు. ఇక్కడ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 300 మంది వరకు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ డిజిటల్ ర్యాలీని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే సమయంలో 50,000 మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించారు. ఇప్పటికే 400000 కంటే ఎక్కువ మంది సోషల్ మీడియాలో 30 వేల కామెంట్స్, 9000 షేర్ల చేశారని కాంగ్రెస్ తెలిపింది. ఈ ర్యాలీ జరిగిన రెండు గంటల్లోనే 9 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని కాంగ్రెస్ పేర్కొంది. ఇది దేశంలోనే అత్యంత విజయవంతమైన హైబ్రిడ్ వర్చువల్ ర్యాలీ అని వెల్లడించింది.
పంజాబ్ లో బిజీబిజీగా రాహుల్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్‌లో ఒక రోజు పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. రాహుల్ గాంధీతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఉన్నారు. స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 117 మంది అభ్యర్థులతో కలిసి దుర్గియానా మందిర్, భగవాన్ వాల్మీకి తీర్ లో పూజలు చేశారు. గాంధీ ఆ తర్వాత రోడ్డు మార్గంలో జలంధర్‌కు వెళ్లారు. అక్కడ జలంధర్‌లోని మిథాపూర్‌లోని వైట్ డైమండ్‌లో ఏర్పాటు చేసిన వర్చువల్ ర్యాలీ "నవీ సోచ్ నవ పంజాబ్"లో పాల్గోని ప్రసంగించారు. ఈ నెల ప్రారంభంలో ఎన్నికల సంఘం భౌతిక ర్యాలీలపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం తర్వాత రాహుల్ గాంధీ తొలిసారిగా పర్యటించారు. ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.