Russia Ukraine War:


బాధ్యతా రాహిత్యం: నాటో 


బెలారస్‌లో రష్యా అణ్వాయుధాలు మొహరిస్తామని పుతిన్ హెచ్చరికలు జారీ చేయడంపై NATO తీవ్రంగా స్పందించింది. రష్యాపై విమర్శలు చేసింది. ఇది "ప్రమాదకరమే కాదు. బాధ్యతా రాహిత్యం కూడా" అని మండి పడింది. 


"నాటో అన్ని గమనిస్తోంది. రష్యా వైఖరిలో ఏ మార్పూ కనిపించడం లేదు. మళ్లీ అణ్వాయుధాల ప్రస్తావన తీసుకొస్తోంది. ఇక ఏం చేయాలన్నది మేమే నిర్ణయించుకుంటాం. నాటో సభ్య దేశాలన్నీ తప్పనిసరిగా గట్టి బదులే ఇస్తాయి. రష్యా పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తోంది."


- నాటో ప్రతినిధి 


ఉక్రెయిన్ ఆగ్రహం..


బెలారస్‌తో ఉక్రెయిన్‌తో పాటు నాటో సభ్య దేశాలైన పోలాండ్, లిథుయేనియా, లావిటా దేశాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై పట్టు సాధించాలంటే ఈ ప్రాంతమే సరైందని రష్యా భావిస్తోంది. అటు నాటోకు కూడా గట్టి హెచ్చరికలు ఇచ్చినట్టవుతుందని యోచిస్తోంది. అందుకే...అక్కడే అణ్వాయుధాలను ఉంచాలని పావులు కదుపుతోంది. అయితే...అమెరికా మాత్రం రష్యాకు అంత సీన్‌ లేదని తేల్చి చెబుతోంది. ఇవన్నీ బెదిరింపులేనని వెల్లడించింది. పుతిన్ అణ్వాయుధాలతో దాడి చేస్తారని అనుకోడం లేదని తెలిపింది. కేవలం కొద్ది రోజుల పాటు బెలారస్‌లో ఉంచేందుకు ఒప్పందం కుదిరి ఉండొచ్చని భావిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ తీవ్రంగా మండి పడుతోంది. రష్యా అనవసరంగా పరిస్థితులను సంక్లిష్టం చేస్తోందని విమర్శిస్తోంది. రష్యా ప్రజలే ఈ తరహా నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. కావాలనే ఇలా కవ్విస్తోందని చెప్పింది. 






రష్యన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు..


రష్యాకు చెందిన పది ఎయిర్‌క్రాఫ్ట్‌లు బెలారస్‌కు వెళ్లడం కలకలం రేపుతోంది. ఇవన్నీ అణ్వాయుధాలును మోయగలిగే సామర్థ్యం ఉన్నవే. బెలారస్‌లో అణ్వాయుధాలను మొహరించడం...చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదని పుతిన్ స్పష్టం చేస్తున్నారు. చట్టానికి లోబడి మాత్రమే ఈ పని చేశామని వెల్లడించారు. అంతే కాదు. అమెరికా కూడా ఇదే పని చేస్తోందంటూ ఎదురు దాడికి దిగారు. ఐరోపా మిత్ర దేశాల్లో తమ అణ్వాయుధాలను దాచి ఉంచారని ఆరోపించారు. పోలాండ్‌తో సరిహద్దు పంచుకుంటున్న బెలారస్‌లో రష్యా అణ్వాయుధాలు ఉండటం అంతర్జాతీయంగా ఆందోళన పెంచుతోంది. జులై 1వ తేదీ నాటికి బెలారస్‌లో న్యూక్లియర్ వెపన్స్ స్టోరేజ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రష్యా తేల్చి చెబుతోంది. రష్యాకు మద్దతుగా నిలుస్తున్న బెలారస్‌పై అమెరికా ఆంక్షలు విధించిన వెంటనే రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్‌లు అక్కడికి వెళ్లాయి. ఫలితంగా..రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరో స్థాయికి వెళ్తుందా..? అన్న అనుమానాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. 


Also Read: Dalai Lama: చైనాకు గట్టి షాక్ ఇచ్చిన దలైలామా, మంగోలియా బాలుడికి కీలక పదవి