జీవో 217తో మత్స్యకారులు నష్టపోతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహించారు. ఈ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోని లేని విధంగా జీవో 217ను ఏపీలో అమలు చేస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభి రాష్ట్రమంతా అమలు చేస్తారన్నారు. జీవో 217కు వ్యతిరేకంగా మత్స్యకారుల పోరాటానికి అండగా ఉంటానన్నారు. జీవో పేపర్లను పవన్ వేదికపై చింపేశారు. మత్స్యకారుల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. జీవో కాపీ చింపితే చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని, కేసులు పెట్టినా భయపడనన్నారు. మత్స్యకారులకు ఇళ్లు నిర్మించలేదని, తుపాను షెల్టర్లు కూడా కట్టలేదని ఆరోపించారు. జనసేన అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఈ జీవోలు రద్దు చేస్తామన్నారు. 


2024 సాధారణ ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలని పవన్ పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు సమస్యలు పరిష్కారం పేరుతో అనేక ఇబ్బందులు పెడతారని ఆరోపించారు. ప్రజలు అధికారం ఇచ్చింది మటన్‌, చికెన్‌ షాపులు పెట్టడానికా అని పవన్ ప్రశ్నించారు. పాదయాత్రలో ప్రజలకు వేటకు వెళ్లి చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు కానీ మూడేళ్లలో 64 మత్స్యకార కుటుంబాలకు మాత్రమే పరిహారం అందిందని పవన్ అన్నారు. చట్టాలు పాటించేలా ముందు వైకాపా నేతలను నిలదీయాలన్నారు. గంగవరం జెట్టీ పేరుతో మత్స్య కారులను నిరాశ్రయులను చేశారన్నారు. మత్స్యకారులు అండగా ఉంటే సమస్యలు పరిష్కరిస్తామని పవన్ హామీఇచ్చారు. జీవో 217ను వెనక్కి తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. 


రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడిన పవన్ రాజమహేంద్రవరం నుంచి నరసాపురం వస్తుంటే దారి పొడవునా గోతులే అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జనసేన సభకు చక్కని ఏర్పాట్లు చేసిందని, దారంతా గొయ్యిలే చక్కటి అభివృద్ధి అని వ్యంగ్యంగా అన్నారు. రోడ్లపై పడవ ప్రయాణం ఊగుతూ వస్తుంటే మాయాబజార్‌లో లాహిరి లాహిరి పాట గుర్తొచ్చిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా గెలిచిన జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చేస్తున్నారన్న, భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. జనసైనికులకు పార్టీ ఎప్పుడూ ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ నేతల బెదిరింపులకు జనసైనికులు భయపడరన్నారు. అక్రమ కేసులు పెట్టి హింసిస్తే ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. రాష్ట్రంలో 65 నుంచి 70 లక్షల మంది మత్స్యకారుల పొట్టకొట్టేందుకు జీవో 217 తీసుకొచ్చారన్నారు. జనసేనకు పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే జీవో 217 చించిపారేసే వాళ్లమన్నారు.