Mutual Funds Growth 2022: 2021 రూపంలో అద్భుత సంవత్సరాన్ని చూసిన మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ.. అదే ఉత్సాహాన్ని, వృద్ధిని 2022లోనూ కొనసాగించడంలో విఫలమైంది. అస్థిర మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ‍‌(2022) పెట్టుబడిదారులు సంఖ్య, పెట్టుబడుల మొత్తం రెండూ తగ్గాయి. నూతన సంవత్సరం కాస్త మెరుగ్గా ఉంటుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.


ప్రధానంగా... రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సరఫరా గొలుసులో అడ్డంకులు, పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా దశాబ్దాల గరిష్టానికి గ్లోబల్ ద్రవ్యోల్బణం వంటి స్థూల కారణాల వల్ల 2022లో మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ వృద్ధి కాస్త నెమ్మదించింది. 2021లో స్టాక్ మార్కెట్ల ర్యాలీ కారణంగా మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్స్‌ రాకెట్లలా దూసుకెళ్లాయి.


2021 -2022 పోలిక
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) 2022లో కేవలం 7 శాతం లేదా రూ. 2.65 లక్షల కోట్లు పెరిగాయి. 2021లోని 22 శాతం వృద్ధి లేదా దాదాపు రూ. 7 లక్షల కోట్ల పెరుగుదలతో పోలిస్తే 2022 లెక్కలు చాలా తక్కువ. 


ఇండస్ట్రీ బాడీ Amfi (Association of Mutual Funds in India) CEO వెంకటేష్ అంచనా ప్రకారం... 2023లో మ్యూచువల్‌ ఫండ్‌ ఇండస్ట్రీ 16- 17 శాతం వృద్ధి చెందుతుంది, భారతదేశ ఆర్థిక వృద్ధితో పాటు రాబోయే బడ్జెట్‌లో చేసే ప్రకటనలు MFల గ్రోత్‌కు సపోర్ట్‌గా నిలుస్తాయి.


నియో స్ట్రాటజీ హెడ్ స్వప్నిల్ భాస్కర్ చెబుతున్న ప్రకారం... 2023లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధి ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటుంది. 2023 చివరి నాటికి సుమారు రూ. 44 లక్షల కోట్ల AUMకు చేరుతుంది.


ఇండస్ట్రీ డేటా ప్రకారం... 2020 డిసెంబర్ చివరి నాటికి రూ. 31 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ AUM, 2021 డిసెంబరు చివరి నాటికి రూ. 37.72 లక్షల కోట్లకు పెరిగింది. 2022 నవంబర్ చివరి నాటికి రూ. 40.37 లక్షల కోట్లకు చేరింది.


2022 సంవత్సరంతో కలిపి, వరుసగా పదో సంవత్సరం కూడా ఇండస్ట్రీ AUM వృద్ధి చెందింది. ఈక్విటీ స్కీమ్‌ల్లోకి వచ్చిన ఇన్‌ ఫ్లోస్‌ ఈ సంవత్సరం వృద్ధికి మద్దతు ఇచ్చాయి.


మ్యూచువల్‌ ఫండ్స్‌ స్పేస్‌లోకి యంగ్‌స్టర్స్‌
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనాల మీద ప్రజల్లో అవగాహన పెరిగిందని, యువతరం ఇన్వెస్టర్లు ఈ స్పేస్‌లో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు కూడా కేటాయింపులను పెంచుతున్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ డైరెక్టర్ కౌస్తుభ్ బేలాపుర్కర్ చెబుతున్నారు.


ఈ ఏడాది కాలంలో పెట్టుబడిదారుల సంఖ్య 1.95 కోట్ల మేర పెరిగిందని అంచనా. 2021లో కొత్తగా 2.6 కోట్ల పోర్ట్‌ఫోలియోలు యాడ్‌ అయ్యాయి.


మొత్తం 43 కంపెనీలు ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ... గత ఏడాది రూ. 1.88 లక్షల కోట్లతో పోలిస్తే 2022లో (నవంబర్ వరకు) రూ. 66,952 కోట్ల నికర పెట్టుబడులను చూసింది. నికర పెట్టుబడులు అంటే.. వచ్చిన మొత్తం పెట్టుబడుల నుంచి, ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్న పెట్టుబడులను తీసేయగా వచ్చిన మొత్తం. 


ఈ సంవత్సరం.. డెట్ ఆధారిత పథకాల నుంచి రూ. 2 లక్షల కోట్లకు పైగా డబ్బును ఇన్వెస్టర్లు నికరంగా వెనక్కు తీసుకున్నారు. అయితే ఈక్విటీ స్కీమ్స్‌లోకి రూ. 1.57 లక్షల కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు.


2022లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిదారులను ఈక్విటీ స్కీమ్స్‌ బాగా ఆకర్షించాయి. ఈ పథకాల్లోకి 2021లో వచ్చిన రూ. 96,700 కోట్లతో పోలిస్తే, 2022లో (నవంబర్‌ వరకు) రూ. 1.57 లక్షల కోట్లు వచ్చాయి. 


2021 మార్చి నుంచి ఈక్విటీ పథకాల్లో భారీగా డబ్బులు వచ్చి పడుతున్నాయి. ఏ నెలకానెల పెరుగుతూనే ఉన్నాయి. అయితే 2022 నవంబర్‌లో మాత్రం నికర ఇన్‌ ఫ్లోస్‌ 76 శాతం తగ్గి రూ. 2,258 కోట్లకు చేరాయి, ప్రవాహ వేగం తగ్గింది.


2021 మార్చికి ముందు, కోవిడ్ మహమ్మారి కారణంగా, వరుసగా ఎనిమిది నెలల పాటు ఈక్విటీ స్కీమ్స్‌ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.


ప్రస్తుతం ఈక్విటీల గురించి పెరిగిన అవగాహన, దీర్ఘకాలంలో సంపదను సృష్టించగ వాటి సామర్థ్య మీద నమ్మకంతో ఈ ఏడాది ఈక్విటి ఆధారిత పథకాల్లోకి నగదు ప్రవాహాలు పెరిగాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.