మహారాష్ట్ర ముంబయి బాంద్రాలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ కూలింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 4.40 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది బాధితులను ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: Bihar: ఇద్దరు విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో అక్షరాలా రూ.900 కోట్లు!.. ఎలా వచ్చాయో తెలుసా?
ప్రాణం నష్టం లేదు
ఈ సంఘటన తెల్లవారుజామున 4:40 గంటలకు జరిగిందని అధికారులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ బీకేసీ ప్రధాన రహదారిని శాంతా క్రజ్-చెంబూర్ లింక్ రోడ్‌తో కలుపుతుందన్నారు. "ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరూ తప్పిపోలేదు" అని పోలీసు డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ సింగే అన్నారు. విపత్తు నిర్వహణ సెల్ సమాచారం ప్రకారం నిర్మాణ పనులను ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) చేపట్టింది.