Mumbai Fire Accident: 


ఘట్కోపూర్‌లో..


ముంబయిలోని ఘట్కోపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పరేఖ్ ఆసుపత్రి సమీపంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 8 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో 22 మంది గాయపడగా...వారిని పరేఖ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జునోస్ పిజ్జా రెస్టారెంట్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ముగ్గురు తీవ్ర గాయాల పాలుకాగా...వారిని రాజావాది హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతుండగానే మృతి చెందారు. ఆరు అంతస్తుల బిల్డింగ్‌లోని విద్యుత్ మీటర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అంతకు ముందు సెంట్రల్ ముంబయిలోనూ 61అంతస్తుల బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 22వ అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మంటలు వ్యాప్తి చెందగా...10 మంది సిబ్బంది వచ్చి మంటలార్పారు. గతేడాది కూడా ఇదే అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. 19వ అంతస్తులో ప్రమాదం జరగ్గా...ఓ సెక్యూరిటీ గార్డ్ మృతి చెందాడు. 










కాసేపటికే పుణేలో..


ఇది జరిగిన కాసేపటికే...పుణేలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. భీమా కొరేగావ్ ప్రాంతంలోని ఎయిర్ ఫిల్టర్ తయారు చేసే ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇందుకు కారణాలేంటన్నది ఇంతా తెలియలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.